మున్సిపాలిటీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– రూ.12.3 కోట్ల పనులకు శంకుస్థాపనలు
– దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభం
– త్వరలో నూతన పింఛన్లు, రేషన్ కార్డులు
– దుబ్బాకకు మరిన్ని నిధులు తీసుకొస్తాం
– కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 13:  రాష్ట్రంలో మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.. మంగళవారం దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, పురపాలక పరిధిలోని ధర్మాజీపేట, లచ్చపేట, అలాగే 13, 14, 15, 18 వార్డుల్లో రూ.10 కోట్ల నగరాభివృద్ధి నిధులతో చేపట్టిన పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా దుంపలపల్లి శివారులో రూ.2.3 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం బాధ్యుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీయూఎఫ్ఐడీసీ నిధులు లేనప్పటికీ మంజూరు పత్రాలు చూపించి అభివృద్ధి పనులను కాగితాలకే పరిమితం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తోందన్నారు. త్వరలోనే అర్హులైన వారికి నూతన వృద్ధాప్య, వితంతు పింఛన్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్ల వ్యయంతో పేదలందరికీ సన్నబియ్యంను రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తోందన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి 56 మంది కాంగ్రెస్ సర్పంచ్లు గెలుపొందడం కార్యకర్తల కృషికి నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రెండు పడక గదుల ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని, ఆ పార్టీ నాయకులు వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు నిర్మించుకున్నారని విమర్శించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరేసేలా కార్యకర్తలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే దుబ్బాక అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో సదానందం, డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ ఆర్య, దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగర రవి, పుర కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్య, సంక్షేమానికి పెద్దపీట

సిద్దిపేట అర్బన్ మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మిట్టపల్లి గ్రామంలో రూ.2 కోట్ల 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం  అదనపు తరగతి గదులను, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రూమ్, కంప్యూటర్ రూమ్, తరగతి గదులను ప్రారంభించి విద్యార్థినుల సదుపాయాలను పరిశీలించారు. బాలికల విద్యాభివృద్ధే సమాజ పురోగతికి పునాది అని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే. హైమావతి, ఆర్డీఓ సదానందం, జిల్లా విద్యాశాఖ అధికారి, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ బాధ్యుడు పూజల హరికృష్ణ ,సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అత్తు ఇమామ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు పెయ్యల తార  నర్సింహులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మంత్రి  ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులను శాలువతో సన్మానించి, ఇంట్లో ఏర్పాటు చేసిన డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా..మంత్రి మాట్లాడుతూ, నిరుపేద ప్రజలు సౌకర్యవంతమైన సొంత ఇంటిలో నివసించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతోందన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి పలువురు చేసిన విజ్ఞప్తులకు మంత్రి స్పందిస్తూ తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *