– చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే నూతన నిర్మాణాలు
– 10న వర్సిటీ సందర్శిస్తా.. నెలాఖరు నాటికి పనులపై తుది నిర్ణయం
– ఓయూ అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ నమూనాల పవర్ పాయింట్ ప్రజంటేషన్స్‌ను సీఎం వీక్షించారు. హాస్టల్ భవనాలు, రహదారులు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సీఎం సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే నూతన జల వనరుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. హాస్టల్, అకడమిక్ భవనాల నిర్మాణం విషయంలో వందమంది విద్యార్థులుంటే అదనంగా మరో పది శాతం విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని సీఎం సూచించారు. చారిత్రక ప్రాధాన్యం లేని పురాతన భవనాలకు భారీ మొత్తాలు వెచ్చించి మరమ్మతులు చేసే బదులు నూతన భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్‌లతోపాటు ప్రతి పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీన యూనివర్సిటీని సందర్శించనున్నట్లు, అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లను పరిశీలిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ది పనులకు సంబంధించి విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని, తొలుత అభివృద్ధి నమూనాలు వారి ముందుంచాలని, తర్వాత అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి ప్రణాళికలను ఖరారు చేయాలన్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




