– అభివృద్ధికి రూ.1000 కోట్లతో రూట్ మ్యాప్
– అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమన్నారు. అంతటి పేరెన్నికగన్న విశ్వవిద్యాలయం అంతర్జాతీయస్థాయికి ఎదగాలని కాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో నిర్మాణ్-26 సాంకేతిక సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1917లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. అందుకు కొనసాగింపుగా 1929లో విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రారంభమైన ఇంజినీరింగ్ కళాశాల దేశంలోనే అత్యంత ప్రాశస్త్యమైన కళాశాలల్లో 6వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. అంతటి ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించడమేకాÅ£ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏకంగా రూ.1,000 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం చరిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయంలో అవసరమైన అధ్యాపకుల భర్తీ విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడినుండి ఎంతో మేధో సంపద ఉత్పత్తి అయిందని, ఆ మేధస్సు ప్రపంచస్థాయిలో అభివృద్ధికి దోహదపడుతున్నదని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న మెజారిటీ ఇంజినీర్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండే ఎదిగారని, అంతేగాక గల్లీ నుండి దిల్లీ స్థాయికి ఎదిగిన నేతలు, క్రీడాకారులు, ఉన్నత పదవులు చేపట్టిన వారి అడుగులు ఇక్కడినుండే మొదలయ్యాయని చెప్పారు. అలాంటి విశ్వవిద్యాలయం రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలవడమేకాక విద్యార్థులు చేసిన త్యాగాలు ప్రస్తావనర్హమేనని భావిస్తున్నానన్నారు. ఇందులోని విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా భాగస్వాములు కావాలని ఆయన ఉద్బోధించారు. ఇంజినీరింగ్ విభాగం గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీరింగ్ విభాగం ముఖ్య భూమిక పోషిస్తున్నదని ఆయన చెప్పారు. నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులతోపాటు ఎసఎల్‌బిసి, దేవాదుల వంటి ఆధునిక ప్రాజెక్టులు ఇంజినీరింగ్ ప్రతిభకు అద్దం పడుతున్నాయన్నారు. అవి సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌గా ఉపయోగపడతాయని చెప్పారు. భవిష్యత్తులో స్థిరమైన అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, జలవనరుల సమగ్ర నిర్వహణతోపాటు చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు మాత్రమే పరిమితంకాÅ£ వాటి భద్రత, నిర్వహణ బాధ్యతలు కూడా ఇంజినీర్లకు ఉంటాయన్నారు. నిర్మాణ్-26 వంటి సాంకేతిక సదస్సులు విద్యార్థులకు పరిశోధన, సృజనాత్మకతను పెంపొందించే వేదికలని చెప్పారు. మన నిర్మాణాలు కేవలం కట్టడాలకే పరిమితంకాక ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు దోహదపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




