సకల భావజాల మదనమే నిజమైన యూనివర్సిటీ
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం జరిగిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గత పదేళ్లు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సల్లర్ల నియామకం లేదు.. ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్లు లేవు.. యూనివర్సిటీలు నిర్వీర్యం కాకూడదనే తమ ప్రభుత్వం రాగానే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులను వైస్ ఛాన్స్లలర్లుగా నియమించాం, ప్రొఫెసర్ల నియామకం ప్రారంభించామని తెలిపారు. నైపుణ్యం లేని విద్య మూలంగా భవిష్యత్తు అంధకారంగా మారుతుందని భావించిన తమ ప్రభుత్వం మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 100 ఐటిఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని తెలిపారు. కోటి ఉమెన్స్ కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి భవన నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచి బెస్ట్ డాక్టర్లతో మెనూ రూపొందించి అమలు చేస్తున్నామని వివరించారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించి ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ఇవి ఈ రాష్ట్రగతినే మార్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని భట్టి తెలిపారు. ఈ దేశానికి ప్రధాని పీవీని అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీకే దక్కిందన్నారు. అనేకమంది బ్యూరోక్రాట్లు, సైంటిస్టులు, రాజకీయ నాయకులను, మేధావులను ఉస్మానియా యూనివర్సిటీ అందించింది అన్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న విద్యార్థులు ఉద్యోగాలు పొంది కుటుంబాలకు అండగా ఉండటమే కాదు విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి తోడ్పడాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. మార్క్సిజం, మావోయిజం, గాంధీ ఇజం అన్ని భావాలు మధనం జరిగితేనే నిజమైన యూనివర్సిటీ అన్నారు. మీ వాదనతో నేను ఏకీభవించకపోవచ్చు కానీ మీరు చెప్పే హక్కును ప్రాణం ఉన్నంత వరకు రక్షిస్తా అని ఒక ఫిలాసఫర్ అన్నారంటూ ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. యూనివర్సిటీలో జరగాల్సిన చర్చ, భావ స్వేచ్ఛ దశాబ్ద కాలంగా లేకుండా పోవడంతో ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఎనర్జీ, ఎడ్యుకేషన్ ప్రపంచానికి దిక్సూచిగా మారాలి అని అభిప్రాయపడ్డారు. ఇటీవల తాము చేపట్టిన సమగ్ర ఆర్థిక ,సామాజిక, రాజకీయ, విద్య మరియు కుల సర్వేలో అభివృద్ధికి ఉత్పత్తి రంగం అయిన భూమికంటే చదువు కూడా అభివృద్ధికి అతి ముఖ్యమైన అంశమని తేలిందని తెలిపారు. యూనివర్సిటీలో ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని వైస్‌చాన్స్‌లర్, ప్రిన్సిపాల్ కోరారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వీసీ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.





