ఉద్యోగులకు ఒరాకిల్ షాక్

– ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది తొలగింపు
– అందులో 12వేలమంది భారతీయులు

న్యూయార్క్, ఏప్రిల్ 1: అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒక్కసారిగా భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం అంటే దాదాపు 30వేల మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో ఏకంగా 12వేల మంది భారత దేశానికి చెందినవారే కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటలకు వేలాదిమంది ఉద్యోగులకు ఒకేసారి లేఆఫ్ మెయిల్స్ పంపారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్ అవసరం లేదని పేర్కొంటూ తొలగింపు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31నే వారి చివరి పనిదినంగా ప్రకటించడంతోపాటు కంపెనీ ల్యాప్‌టాప్‌లు, సిస్టమ్‌ల యాక్సెస్‌ను వెంటనే నిలిపివేయడం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. ఒరాకిల్ ఇండియాలో సుమారు 30వేల మంది పనిచేస్తుండగా వారిలో గణనీయమైన శాతం ఈ కోతలకు గురైనట్లు సమాచారం. అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగుల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజీరియల్ స్థాయిలో ఉన్న ఉద్యోగులే ఎక్కువగా ఈ వేటుకు గురైనట్లు సమాచారం. ఇది ఒక్క విడత మాత్రమేనని, ఇంకా మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందన్న వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఏ సమయంలోనైనా మరో చేదు వార్త వినాల్సి వస్తుందేమోనని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఒరాకిల్ ప్రస్తుతం నష్టాల్లో లేదు. ఇటీవల ముగిసిన తైమాసికంలో కంపెనీ లాభాలు గత ఏడాదితో పోలిస్తే 95శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, కంపెనీ ఇప్ప్పుడు డేటా సెంటర్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. సుమారు 156 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు చేపట్టగా అందులో భాగంగా ఇప్పటికే 50 బిలియన్ డాలర్లు అప్ప్పు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగాల కోతలు విధిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా కంపెనీకి 10 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అంచనా. ఇక తొలగించిన ఉద్యోగులకు కంపెనీ కొన్ని పరిహారాలు ప్రకటించింది. అదనంగా మూడు నెలల జీతం, కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికి 15 రోజుల జీతం, మిగిలిన సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం, కార్మిక చట్టాల ప్రకారం గ్రాట్యుటీ. అయితే, ఈ ప్రయోజనాలు కంపెనీ నిర్దేశించిన గడువులోపు రాజీనామా చేసిన వారికే వర్తిస్తాయని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *