– వారి బురదను మాకు అంటించే యత్నం
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రతిపక్షానికి చెందిన కొంతమంది తమకు అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ దీవించడానికి సిద్ధంగా ఉన్నారని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో రూ.1.52 కోట్లతో నిర్మించిన ప్యాక్స్ గోదాములను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అలాగే మండలంలో 191 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.58.58 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా ఈ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రూ.20,670 కోట్ల మేర రుణ మాఫీ చేసి చరిత్ర సృష్టించామని, ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు అందిస్తూ, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3.80 లక్షల మందికి పాస్ పుస్తకాలు అందజేశామన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందులు పడ్డారని, దాన్ని బంగాళాఖాతంలో వేసి భూ భారతి తీసుకొచ్చామని తెలిపారు. అనంతరం వెంకటాపురంలో దేపంగి శ్రీకాంత్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, మునిసిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి పుల్లయ్య, తహసీల్దార్ సైదులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




