విపక్షాల నోళ్లు మూతప‌డ్డాయ్‌

– ప్రభుత్వంపై ప్రజలు అచంచల విశ్వాసం చూపారు
– ఈ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
– పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు
– మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మధిరలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని బురద చల్లిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చరిత్రాత్మక విజయమని కొనియాడారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారంటూ విజయం అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రిమండలి సమష్టిగా పనిచేస్తూ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్లి అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించామని భట్టి పేర్కొన్నారు.

ఉద్యోగాల కల్పనే లక్ష్యం

పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. విస్తరిస్తున్న పట్టణాలను అభివృద్ధి చేయడానికి మున్సిపల్ శాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ‘ప్యూర్-క్యూర్-రేర’ విధానంతో ముందుకు సాగుతున్నారన్నారు. మున్సిపల్ పరిపాలనలో జవాబుదారీతనం పెంచడానికి, పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ‘ప్యూర్ – క్యూర్ – రేర’ అని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మీడియా సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రామనాథం, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ, నూతన కౌన్సిలర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *