– పోరాడి రిజర్వేషన్లు సాధించుకున్న మొదటి రాష్ట్రం తమిళనాడు
– రేవంత్ ప్రయత్నాలకు డీఎంకే సహకారం: కనిమొళి
న్యూదిల్లీ, ఆగస్టు 6: దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలకు పలు పార్టీల నేతలు మద్దతు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఇక్కడ ధర్నా చేపట్టారు. మంగళవారం నాడు పార్లమెంటు ఉభయ సభలలో కాంగ్రెస్ ఎంపీలు రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరపాలని నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని కనిమొళి ఉద్ఘాటించారు. పెరియార్ కాలం నుంచి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ ఉందని గుర్తుచేశారు. పోరాటం చేసి రిజర్వేషన్లు పెంచుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంపునకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు డీఎంకే పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై తెలంగాణ ఎంపీలు చేసే పోరాటానికి డీఎంకే మద్దతు ఉంటుందని కనిమొళి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ బీజేపీ బీసీల ఓట్లు దండుకుని ఇపుడు వారి రిజర్వేషన్ల బిల్లు ఆమోదించడంలేదని ఆరోపించారు. బీసీలు వాళ్లని బిచ్చమెత్తుకోవాలా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించకపోతే ఎప్పటికీ బీసీల విరోధిగానే బీజేపీ మిగులుతుందన్నారు. వారెప్పటికీ మీ పార్టీకి ఓటేయబోరని ప్రధాని మోదీని హెచ్చరించారు. ఆర్జేడీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తమ పార్టీ తరపున, పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తరపున కాంగ్రెస్ ఆందోళనకు మద్దతు తెలిపారు. తెలంగాణ డిమాండ్‌ను పరిష్కరించాలని తాము కోరుతున్నామన్నారు. సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ మాట్లాడుతూ తెలంగాణ ఆమోదించిన బిల్లు నాలుగు నెలలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి వద్ద పెండిరగ్‌లో ఉందని, దేశమంతటా గవర్నర్లు ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.





