జి రామ్ జి చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

– ఉపాధి పథకాన్ని కాపాడాలని తీర్మానాలు చేస్తాం
– 27 లేదా 28న కొత్త సర్పంచులతో ర్యాలీలు
– కొత్త స‌ర్పంచ్‌లు, ఉప స‌ర్పంచ్‌ల‌కు అభినంద‌న‌లు
– ఉపాధి ప‌థ‌కం పేరు మార్పుపై మంత్రి సీత‌క్క‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఉపాధి హామీ చ‌ట్టం పేరు మార్చి దాని స్థానంలో కేంద్రం తెచ్చిన కొత్త జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడతానమ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క వెల్ల‌డించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కారు చౌకగా కూలీలను సరఫరా చేసేందుకు నూతన చట్టం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విమ‌ర్శించారు. గాంధీ భవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి కొప్పుల రాజుతో కలిసి సోమ‌వారం మీడియా సమావేశంలో జాతీయ ఉపాధి హామీ చట్టంపై కేంద్రం వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిదేనని స్పష్టం చేశారు. వలసలను అరికట్టేందుకు, వెట్టి చాకిరి నుంచి గ్రామీణుల‌ను విముక్తి చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఈ చట్టం నుంచి గాంధీ పేరు తొలగించడం ద్వారా బీజేపీ మరోసారి ఆయ‌న‌ను హత్య చేసినట్లేనని వ్యాఖ్యానించారు. కేంద్రం పని దినాలను తగ్గిస్తూ గ్రామీణ కూలీల సొంత ఊర్లో పని చేసే హక్కును కాలరాస్తోందన్నారు. కార్పొరేట్ల మైనింగ్ అవసరాలకు తక్కువ కూలికి కార్మికులను సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఉపాధి చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ చట్టం రద్దయితే గ్రామాల్లో ఉపాధి లేక కూలీలు కార్పొరేట్ల దోపిడీకి గురవుతారని హెచ్చరించారు. ఉపాధి పథకం భిక్ష కాదని, హక్కుగా లభించాల్సినదని సీతక్క స్పష్టం చేశారు. నాలుగేళ్ల కష్టంతో రూపొందించిన చట్టాన్ని నాలుగు గంటల చర్చ కూడా లేకుండా కొత్తగా జీ–రామ్–జీ చట్టంగా తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. గతంతో పోలిస్తే కోట్లాది పని దినాలు తగ్గించారని, 125 రోజుల పని అనే ప్రకటన బోగస్ అని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలు, ఎస్సీ–ఎస్టీలకు పెద్ద ఎత్తున ఉపాధి లభించిందని, తెలంగాణలో మహిళల భాగస్వామ్యం 62 శాతం, ఎస్సీ, ఎస్టీలతో కలిపితే సుమారు 90 శాతం ఉందని తెలిపారు. కరోనా కాలంలో చదువుకున్న యువతకు కూడా ఉపాధి కల్పించిన ఘనత ఈ చట్టానిదేనని గుర్తు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేందుకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. జి రాం జీ చట్టాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. 27 లేదా 28 తేదీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా, నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ఉప సర్పంచులకు మంత్రి సీతక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *