– జాతి సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలి
– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
– పేర్లు మార్చి చరిత్రను కాలరాస్తున్నారు
– బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
– కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విముక్తి దివస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించి కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్‌లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం అని కొనియాడారు. సర్దార్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మమార్గంలోనే నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. పటేల్ కలలు గన్న దేశాన్ని నిర్మించేందుకు భారత్ ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, ఇవాళ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని, భారత్ అంటే సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం (హైదరాబాద్ ముక్తి దివస్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహింకుంటున్నామని, కార్యక్రమానికి రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరమని అన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజుల గురించి ఈ తరానికి తెలియకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్‌ఎస్‌గాని, తిరిగి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దుర్మార్గంగా తొక్కిపెట్టాయన్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు పాఠ్యాంశాల్లో లేకపోవడం, బయట చెప్పకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ముక్తి దివస్‌ను ఎందుకు అధికారికంగా నిర్వహించడంలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ముక్తి దివస్‌కు పేర్లు మార్చి ఈరోజు ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల పోరాటాన్ని, స్వాతంత్రం కోసం సమర్పించిన అనేకమంది అమరవీరుల త్యాగాలను, ఫలితాలను, ఆకాంక్షలను అవమానిస్తున్నాయని విమర్శించారు. అందుకే కేంద్ర ప్రభుత్వపరంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించమని ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్ల క్రితం ఆదేశించారన్నారు. నిజాం రాజ్యంలో ఖాసిం రజ్వీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీ స్థాపించారని, ఇప్పటి పాలక పార్టీలు ఆ ఎంఐఎంకు భయపడి ఇన్నేళ్లుగా ఈ చరిత్రను, త్యాగాలను, బలిదానాలను, వాస్తవాలను తొక్కిపెడుతున్నాయని విమర్శించారు. ముస్లింల ఓట్ల కోసమే ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడుతున్నారని ఆగహ్రం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గామాన, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద పండుగగా హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈరోజు విశ్వకర్మ దివస్ కూడా కావడం మరొక ప్రత్యేక సందర్భమని, ఈ సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కిషన్‌రెడ్డి అన్నారు. 1948లో నిజాం సైన్యం అయిన రజాకార్లను అణచివేసేందుకు యుద్ధం ప్రకటించి ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛను అందించిన సమయంలో గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సభ్యులు కూడా ఆ ఆర్మీలో పాల్గొన్నారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి త్యాగాలు చేసిన అమరవీరులను ప్రజలు తలచుకుని మన సంస్కృతిని, ఐక్యతను నిలుపుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, కల్చరల్ సెక్రటరీ వివేక్ అగర్వాల్, సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, సీఆర్పీఎఫ్, సీఎస్‌ఎఫ్, పోలీస్ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





