ఆపరేషన్‌ ‌కగార్‌ను త‌క్ష‌ణం ఆపాలి

– ఆదివాసీలే హతమవుతున్నారు
-ఇది ప్ర‌జాస్వామ్య సూత్రాలకు విరుద్దం
– మావోలతో వెంటనే శాంతి చర్చలు జరపాలి
-అరిక‌ట్టాల్సింది దోపిడీని, మావోయిస్టుల‌ను కాదు
– అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తే న‌క్స‌లైట్ అనడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు?
– ఇందిరాపార్క్ ‌వద్ద మహాధర్నాలో మేధావులు
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 17: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ‌కగార్‌ను ఎత్తివేయాలని సోమ‌వారం నిర్వ‌హించిన మహాధర్నాలో పాల్గొన్న ప‌లువురు డిమాండ్‌ ‌చేశారు. ఆపరేషన్‌ ‌కగార్‌కు నిరసనగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ ‌లో శాంతి చర్చల కమిటీ ఆధ్వ‌ర్యంలో మహా ధర్నా జరిగింది. ఇందులో అఖిల‌ప‌క్ష నాయ‌కులు పాల్గొన్నారు. వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌, ‌తమ్మినేని వీరభద్రం, నారాయణమూర్తి, ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌మాట్లాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆపరేషన్‌ ‌కగార్‌లో ఎక్కువ మంది ఆదివాసీలే చనిపోతున్నారన్నారు. ఆపరేషన్‌ ‌కగార్‌ను నిలిపివేసి శాంతియుత చర్చలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఆపరేషన్‌ ‌కగార్‌ ‌తమ పార్టీ దృష్టిలో ఆపరేషన్‌ ‌కార్పొరేట్‌ ‌కబ్జా అని, మానవత్వానికి ఇది ఒక మచ్చ అని భారాస నేత దాసోజు శ్రావణ్‌ ‌విమర్శించారు. అణచివేయాల్సింది మావోయిస్టులను కాదు, దోపిడీనని ఈ ధర్నాలో పాల్గొన్న సినీ నటుడు, దర్శకుడు ఆర్‌ ‌నారాయణ మూర్తి అన్నారు.
మావోయిస్టులను చంపడం కాదు, జల్‌, ‌జంగిల్‌, ‌జన్‌ ‌నినాదానికి పరిష్కారం చూపించాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వరరావు కోరారు. ఆదివాసీ, పౌర సంఘాలతో భారత రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపాలన్నారు. శాంతి చర్చలు జరపకపోవడం వల్లే ఆదివాసీ ప్రాంతాల్లో అల్లకల్లోలం నెలకొందన్నారు. ‘మావోయిస్టులతో చర్చలు జరపాలని మేం అంటే.. మమ్మల్ని మావోయిస్టులు అంటున్నారు. తాము మావోయిస్టులు అయితే మైకులు ఎందుకు పట్టుకుంటాం.. తుపాకులు పట్టుకునే వాళ్లమ‌ని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని రాజ్యాంగం చెబుతోందని కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి అన్నారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో మావోయిస్టులతో చర్చలు జరిపారని, మోదీ ప్రభుత్వం మాత్రం మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నా చంపేస్తోందని విమర్శించారు. మావోయిస్టులను చంపడం తాత్కాలిక ఉపశమనమేనని శాశ్వత పరిష్కారం కాదన్నారు. శాంతిచర్చలు జరిపితే పరిష్కారం దొరుకుతుందని మోదీ, అమిత్‌షా గ్రహించాలని చెప్పారు.
కాంగ్రెస్‌ ‌పార్టీ రాజ్యాంగానికి లోబడి ఉందన్నారు. అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే అమిత్‌ ‌షా నక్సలైట్‌ ‌రహిత దేశంగా చేస్తామంటున్నారని నటుడు ఆర్‌ ‌నారాయణ మూర్తి ఫైర్‌ అయ్యారు. పాకిస్తాన్‌ ‌తో చర్చలు జరిపిన కేంద్రం భరత మాత ముద్దు బిడ్డలైన మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అన్యాయాన్ని అడిగిన వాడు నక్సలైట్‌, అడగని వాడు ఆల్‌ ‌రైట్‌ అనే ఉద్దేశంతో కేంద్రం వ్యవహరిస్తున్న‌దని విమర్శించారు. అణిచివేయాల్సింది మావోయిస్టులను కాదు దోపిడీని అని ప్రొఫెసర్‌ ‌కె. నాగేశ్వర్ అన్నారు. ఇది యుద్ద సమయం కాదు.. చర్చలతోనే పరిష్కరించుకోవాలని మాస్కో , సైప్రస్‌ ‌లో అన్న మోదీ మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపరని ప్రశ్నించారు. మావోలతో చర్చలు జరపకున్నా సరే ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు. భారత రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపండి. దేశంలోని సహజ వనరులను ప్రజల అభివృద్ధి కోసమే వాడాలని రాజ్యాంగంలో తెలిపిందన్నారు.
చర్చలు జరిపితే ఆదివాసీ ప్రాంతాల్లో అల్లకల్లోలం ఆగుతుందన్నారు. చర్చలు జరగకుంటే మావోయిస్టులకు ఇబ్బంది లేదు. ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కానీ ఆదివాసీ బిడ్డలకు కష్టం వస్తుంది. వారి హక్కులకు భంగం కలుగుతుందని హెచ్చరించారు. మావోయిస్టులైన భారత పౌరులను చంపుతున్న మోదీ,అమిత్‌ ‌షాలు… వీళ్లేం హిందువలని ప్రశ్నించారు. ఇదేనా రామ రాజ్యం అంటే? ఆపరేషన్‌ ‌కగార్‌ ‌ను తక్షణమే ఆపేసి శాంతి చర్చలు జరపాలని అన్నారు. కార్పొరేట్‌ ‌సంస్థల కోసమే ఆదివాసీలపై కేంద్రం యుద్ధం చేస్తున్న దన్నారు ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌. ‌శాంతి చర్చలే అభివృద్ధికి మార్గం అవుతుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చర్చలతో మావోయిస్టుల సమస్యకు పరిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. అడవిలోకి కేంద్రం ఎందుకు వెళ్తోంది. ఆపరేషన్‌ ‌కగార్‌ ‌ప్రైవేట్‌ ‌సంస్థల కోసమే ఆపడం లేదని విమర్శించారు. చర్చలతోనే మావోయిస్టు సమస్య పరిష్కారమని హరగోపాల్‌ అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *