ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీపై ఫోక‌స్‌

– రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులతో విస్తుపోయే నిజాలు
– 75శాతం మంది రౌడీషీటర్లు గంజాయి బానిసలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ’ ఇపుడు పెను సంచలనం సృష్టిస్తోంది. రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. భాగ్యనగరంలో పెరుగుతున్న నేరాలకు మత్తు పదార్థాలే కారణమని గుర్తించిన పోలీసులు రౌడీషీటర్ల పని పట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రౌడీషీటర్లను పిలిపించి వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించడంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నగరంలో ప్రస్తుతం 1,300మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 250 మందికిపైగా డ్రగ్ టెస్టులు నిర్వహించగా 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్దారించారు. అంటే సుమారు 75శాతం మంది మత్తుకు బానిసైనట్లు స్పష్టమవుతోంది. వీరికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది.. దీని వెనుక ఉన్న ముఠాలు ఏవి అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే రీహాబిలిటేషన్ కేంద్రాలకు తరలిస్తూనే, నగరంలో ఈ మత్తు నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు రంగంలోకి దిగారు. నేరస్థులను కేవలం జైలుకు పంపడం ద్వారా మార్పురాదని సీపీ సజ్జనార్ భావించారు. ఈ సమస్యను మూలాల నుంచి తొలగించాలని నిర్ణయించారు. వెస్ట్ జోన్ పరిధిలో 20 మందికి పాజిటివ్ రావడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వారిని ఉంచి విచారిస్తున్నారు. మత్తు పదార్థాల ప్రభావంతో రౌడీషీటర్లు విచక్షణ కోల్పోయి దాడులు, హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తులో ఉన్నప్ప్పుడు నేరం చేసేందుకు ఏమాత్రం వెనుకాడకపోవడంతో భాగ్యనగరంలో అశాంతి నెలకొంటోంది. ఈ క్రమంలో డ్రగ్ టెస్టులు నిర్వహించడం ద్వారా వారిని కట్టడి చేయడమే కాక మత్తు నెట్‌వర్క్‌ను ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కేవలం రౌడీషీటర్లే కాకుండా, డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లర్లపై కఠినమైన పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. నగరంలో శాంతికి విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను పక్కదారి పట్టిస్తున్న మత్తు మహమ్మారిని అంతం చేసేందుకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. ఈ భారీ ఆపరేషన్ ద్వారా హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం ఇతర రాష్టా లకు ఆదర్శంగా నిలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *