కాగ్ నివేదికతో కళ్లు తెరవండి

– కాంగ్రెస్ పాలనలో గాడితప్పిన ఆర్థిక క్రమశిక్షణ
– ప్రభుత్వాన్ని కడిగి పారేసిన కాగ్
– అవాస్తవిక బడ్జెట్ అన్నది సుస్పష్టం
– అప్పులు తెచ్చినా ఆస్తులు పెంచలేదు
– రాష్ట్ర పరపతిని దెబ్బతీయొద్దు
– బీఆర్ఎస్ నేత హరీష్ రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ నివేదిక స్పష్టం చేసింద‌ని,  కాగ్ రిపోర్టు రేవంత్ సర్కారు కు చెంప పెట్టు లాంటిద‌ని బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.  మేము ఈ ప్రభుత్వ పని తీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించింద‌న్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీ గా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టింద‌న్నారు. అంకెల్లో గోల్ మాల్ ఆచరణలో అంతకన్నా గోల్ మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింద‌ని స్ప‌ష్టం చేశారు.  తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పింది. రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పింద‌న్నారు.  2024 -25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టు లోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాల్ని తప్పు పట్టింది.  2025 -26 ఆర్థిక సంవత్సరం లో ఈ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పులు చేసింది.  పాలన అంటే డొల్ల. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లు కూడా డొల్ల అని కాగ్ రిపోర్టు 2024-25 కుండబద్దలు కొట్టింద‌న్నారు. బ‌డ్జెట్లలో అంచనాలకు, చేస్తున్న ఖర్చులకు ఆమడ దూరం ఉండటమేనా ఆర్థిక క్రమశిక్షణ అంటే?   కాగ్ రిపోర్టు పరిశీలిస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ 2,21,242 కోట్లు ఉంటే, యాక్చువల్స్ 1,67,804 కోట్లు. అంటే బడ్జెట్ అంచనాల్లో చేరుకున్నది కేవలం 76శాతం. రెవెన్యూ ఖ‌ర్చు 2,20,945 కోట్లు ఉంటే, యాక్చువల్స్ 1,77,224 కోట్లు. అంటే చేరుకున్నది 80శాతం.  బడ్జెట్ అంచనాలకు, యాక్చువల్స్ కి ఇంత గ్యాప్ ఉంటుందా?  మాది రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అనే భట్టి గారు దీనికి ఏం సమాధానం చెబుతారు?  వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నదేమిటి?  రెవెన్యూ డెఫిసిట్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరపతి దెబ్బతీసే విధంగా రికార్డు స్థాయి రెవెన్యూ డెఫిసిట్ ను నమోదు చేసింది.  2014-15కు రెవెన్యూ సర్ ప్లస్ 368 కోట్లు ఉంటే, 2023-24కు 779 కోట్లకు పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వం.  కానీ ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2024-25 కు గాను రెవెన్యూ డెఫిసిట్ ను ఏకంగా 9420కు తీసుకువెళ్లింది.  ఒక్క కరోనా సమయం తప్ప ఎన్నడూ ఇంతగా రెవెన్యూ డెఫిసిట్ లేదు.  ఇప్పుడు కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు ఏదీ లేదు.. రెవెన్యూ డెఫిసిట్ మాత్రం మైనస్ 9420 కోట్లకు ఎందుకు పోయినట్లు?  రాష్ట్రాన్ని ఎవరు దివాళా తీయించారు?  మేము రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ ప్లస్ గా అప్పగిస్తే.. మీరు ఒకే ఏడాదిలో రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రంగా మార్చారు. సిగ్గుపడాలి.  కాగ్ లెక్కుల చూస్తే బడ్జెట్ నియంత్రణ కోల్పోయి గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతున్నది.  7 పద్దులు, 2 అప్రాప్రియేషన్స్ లలో కలిపి మొత్తంగా 31,229 కోట్ల ఖర్చు అదనంగా జరిగింది.  బడ్జెట్ లో ప్లాన్ చేసిన ఖర్చు ఒకటి.. అసలు ఖర్చు పూర్తిగా అదుపు తప్పింది.  ఆర్థిక క్రమ శిక్షణ లోపానికి, బడ్జెట్ ఇన్ ఎఫిషియెన్సీకి ఇది మరో స్పష్టమైన ఉదాహరణ.  రెవెన్యూ సెక్షనలోనూ ఇదే గందరగోళం బడ్జెట్ లో 40,453 కోట్లు పెట్టుకొని, 50,978 కోట్లు ఖర్చు చేసారు.  అంటే 10,525 కోట్ల అధిక వ్యయం. 21శాతం  ఒక ప్లాన్ అనేది ఉండదా? బడ్జెట్ లో మీరే చెప్పి మీరే ఫాలో కారా? ప్లానింగ్ లేకుండా ఇష్టం ఉన్నట్లు ఖర్చు చేసుకుంటారా?  మీది ముమ్మాటికి ఇన్ ఎఫిషియెన్సీ బడ్జెట్ అని కాగ్ రిపోర్టు స్పష్టం చేసింది.

ఎఫ్ఆర్‌బీఎం పరిధి అప్పుల విషయానికి వస్తే 2024-25కు గాను జీఎస్ డీపీ లో 32.80శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  కానీ వాస్తవానికి దాన్ని దాటి 34.29శాతంకు పెంచారు. 5,62,662 కోట్లకు చేరింది.  అంటే ప్రభుత్వం తను పెట్టుకున్న పరిమితిని తానే దాటి ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించిందని కాగ్ వెల్లడించింది.  బీఆర్ఎస్ పాలనలో అప్పులు చేసినట్లు వాదించే వారికి కాగ్ రిపోర్టు చెంపపెట్టు.  రెవెన్యూ రిసిప్ట్స్ విషయంలో2023-24లో స్టేట్ రెవెన్యూ 1,11,798 కోట్లు ఉంటే, 2024-25కు 1,09,233 కోట్లకు తగ్గింది.  అంటే సుమారు 2,565 కోట్ల మేర తగ్గుదల నమోదైంది. పన్ను వసూళ్లలో తగ్గుదల, మందగించిన ఆర్థిక వృద్ధి కారణం అన్నది సుస్పష్టం.  పోనీ రాష్ట్రానికి వచ్చే కేంద్ర పన్నుల వాటా తగ్గిందా అంటే అదీ లేదు…  2023-24లో 23,742 కోట్లు ఉంటే, 2024-25కు 27,050 కోట్లకు పెరిగింది.  అంటే రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా 3,308 కోట్ల మేరకు పెరిగింది. కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా పెరిగింది. కానీ రాష్ట్ర రెవెన్యూ రెసిప్ట్స్ తగ్గాయి.  ఎందుకు ఇదంతా జరిగింది అంటే.. అధికారంలోకి వచ్చి రాంగనే రేవంతు రెడ్డి తీసుకున్న పద్దతి పాడు లేని నిర్ణయాలు, విధ్వంసకరమైన విధానాలు కారణం.  వ్యాపారం, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు ఇలా ఒక్కటి కాదు అన్ని రంగాలు కుదేలయ్యాయి. • దీంతో జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ, వాహన పన్నులు వంటి ఆదాయ వనరుల్లో గ‌ణనీయమైన తగ్గుదల నమోదైంది.  వెహికిల్ టాక్స్ 7,095 నుంచి 6,992 కోట్లకు తగ్గింది.  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ – రెవెన్యూ కలెక్షన్ 14,296 కోట్ల నుంచి 8,473 కోట్లకు తగ్గింది.  ఎస్ ఓ టి ఆర్ 1,11,798 కోట్ల నుంచి 1,09,233 కోట్లకు తగ్గింది.  కాంగ్రెస్ పాలనలో.. మొత్తంగా స్టేట్ ఓన్ రెవెన్యూ తగ్గింది, నాన్-టాక్స్ రెవెన్యూ తగ్గింది, వెహికిల్ టాక్స్ తగ్గింది, స్టాంటప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఎస్ ఓ టి ఆర్ తగ్గింది.  రాష్ట్రం సొంత ఆదాయ వనరుల సమీకరణలో దారుణంగా విఫలమైందని కాగ్ రిపోర్టు స్పష్టం చేసింది.  2024-25కు గాను జీఎస్డిపీ వృద్ధి కేవలం 9శాతం మాత్రమే అని కాగ్ తేల్చి చెప్పింది.  అంటే 2024-25 బడ్జెట్ లో మీరు చెప్పిన వృద్ధి రేటు 10.6శాతం అబద్దం అని, అసాధ్యమైందని కాగ్ రిపోర్టుతో వెల్లడైంది.  ఇక మీరు చెప్పే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఓ బూటకం అని కాగ్ రిపోర్టు తేల్చి చెప్పింది.  కాగ్ రిపోర్టు ప్రకారం, మీరు సాధించిన 9శాతం వృద్ధి రేటుతో వన్ ట్రిలియన్ డాలర్ అసాధ్యం అన్నది సుస్పష్టం.  ఇది ఎకనామిక్ విజన్ కాదు.. ట్రిలియన్ డాలర్లు అంటూ మభ్యపెట్టే పొలిటికల్ ప్రాపగాండా. దీన్ని ఇకనైనా ఆపండి.  2023-24లో 38,334 కోట్లుగా ఉన్న రుణాలను 2024-25 నాటికి 56,209 కోట్లకు పెంచారు.  గతంలో ఎన్నడూ లేనంతగా రుణాలు తీసుకున్నరు. 56,968 కోట్లకు గాను 36,072 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్ పెండీచర్ గా చేసారు.  రుణం ద్వారా తెచ్చుకున్న నిధులను క్యాపిటల్ ఎక్స్ పెండీచర్ గా మార్చడంలో తీవ్రంగా విఫలమయ్యారని కాగ్ స్పష్టం చేసింది.  రుణాలు సేకరిస్తున్నరు.. తెచ్చిన నిధులను మాత్రం మూలధన పెట్టుబడిగా మార్చడం లేదు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,054 కోట్లు, హైద్రాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డుకు, మిషన్ భగీరథకు, స్వచ్చ్ భారత్ మిషన్ కు 1386 కోట్లు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాలకు 1201 కోట్లు ఖర్చు చేయలేదని కాగ్ తేటతెల్లం చేసింది.  మీ అప్పులు రాష్ట్రానికి సంపదగా మారడం లేదని కాగ్ కుండబద్దలు కొట్టింది.  సాంఘిక సంక్షేమం విషయంలో మీరు చేసిన ఖర్చును చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలపై మీకున్నది పెదవుల మీద ప్రేమనే అన్నది స్పష్టం అవుతుంది.  సోషల్ వెల్ఫేర్ కోసం 25,971 కోట్లు కేటాయిస్తే.. చేసిన ఖర్చు కేవలం 9,721 కోట్లు. అంటే 37శాతం.  వెనుకబడిన వర్గాలు అంటే కాంగ్రెస్ కు ఎందుకుంత చిన్న చూపు?   అప్పులు తెచ్చి కూడా ఆరు గ్యారంటీలను అమలు చెయ్యలేని అసమర్ధ సర్కార్ ఇది అని కాగ్ పరోక్షంగా తప్పుపట్టింది  కాగ్ నివేదికతో నైనా కళ్ళు తెరవండి ..పిచ్చి కూతలు మాని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెట్టండి బలంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పునాదులు ద్వంసం చేసి దివాలా రాష్ట్రంగా మార్చకండి. ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలికి పాలన మీద దృష్టి సారించండి అని హిత‌వు ప‌లికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *