– 17,18 తేదీల్లో 163 ప్లాట్లకు బహిరంగ వేలం
– 15వ తేదీ రిజిస్ట్రేషన్ కు ఆఖరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను ఈనెల 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలోని తొర్రూర్ ప్రాంతంలో 200 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న125 ప్లాట్లు, కుర్మల్ గూడ లో 200-300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200 -1000 గజాల్లోని 13 ప్లాట్లను విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి వివాదాలు లేని ఈ ప్లాట్లలో తమ అభిరుచులకనుగుణంగా ఇండ్లను నిర్మించుకోవచ్చని, ఈ లే అవుట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి అయ్యిందని తెలిపారు. ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని మేనేజింగ్ డైరక్టర్ వివరించారు. పెద్ద అంబర్ పేట్ లోని అవికా కన్వెన్షన్ లో 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు, 18వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్ పల్లి, కుర్మల్ గూడల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తొర్రూర్ లోని ప్రాజెక్టు సైట్ లోని ప్లాట్లను అనేకమంది స్వయంగా చూసుకుని నచ్చిన ప్లాట్ల నెంబర్లను నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తూ ఇప్పటికే ఈ లే అవుట్ లో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో మాట్లాడటంతోపాటు ప్లాట్ల వాస్తును చూసుకుంటూ సందడి చేస్తున్నారు. తొర్రూర్ లే అవుట్ లో ఉన్న885 ప్లాట్లలో విడతలవారీగా ఇప్పటివరకు 517 ప్లాట్లను విక్రయించారు. మిగిలిన వాటిలో ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గృహావసరాల భూములకు డిమాండ్ ఉండటంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆసక్తి కనపరుస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




