– నేటినుంచి బహిరంగ వేలం ప్రక్రియ షురూ
– అందుబాటులో 1400కుపైగా షాపులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: హైదరాబాద్ పరిసరాల్లోని ‘క్యూర’ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీల్లోని 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లోని 273 షాపులకు ఈ నెల 9, 10 తేదీల్లో వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. వందలాది కుటుంబాలు నివసించే కాలనీల్లో స్థానికుల అవసరాలకనుగుణంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా 60-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు దుకాణాలను నిర్మించారు. వీటిని ఉన్నవి ఉన్నట్లుగా అన్న ప్రాతిపదికన విక్రయిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. వీటికి కనీస ధరలను కూడా బహిరంగ మార్కెట్ కంటే తక్కువగానే నిర్దారించామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆయా కాలనీలను సందర్శించి తమకు నచ్చిన, అనువైన దుకాణాలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు నిర్ణీత మొత్తం ధరావతుతో వేలం నిర్వహించే తేదీల్లో ఉదయం 11 గంటల లోగా సంబంధిత ఆర్డీవో కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చని వివరించారు. దుకాణాల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ కాలనీల నిర్వహణకు వినియోగించనున్నారు. ఇందుకు సహకార సంఘాల చట్టం కింద కాలనీ నివాసితుల సంక్షేమ సంఘాలను (వేల్పేర్ అసోసియేషన్లను) ఏర్పాటు చేస్తారు. వాటి ఆధ్వర్యంలో ఈ కాలనీల నిర్వహణ-అభివృద్ధికి జాయింట్ అకౌంట్ ద్వారా ఈ నిధులను వినియోగించనున్నారు. ఇందుకోసం షాఫుల ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పస్ ఫండ్‌గా డిపాజిట్ చేస్తారు. దానిపై వచ్చే ఆదాయంతోపాటు, ఫ్లాట్లలో నివసించే వారి నుంచి నిర్వహణ రూపేణా ప్రతి నెలా వసూలు చేసే మొత్తంతో ఆయా కాలనీల నిర్వహణను చేపడతారు. ప్రధానంగా కామన్ ఏరియాల్లోని లైట్లు, లిఫ్టులు, బోరింగ్ మొదలైన వాటి నిర్వహణ ఖర్చులతోపాటు, అత్యవసరమైన చిన్నచిన్న మరమ్మతులు మొదలైన వాటి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా ఈ నిధులను వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. అంతేకాక కాలనీల్లోని దుకాణాల ద్వారా పలువురికి ఉపాథి లభించడంతోపాటు స్థానికులకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నది ప్రభుత్వ ఉద్దేశం.
వేలం నిర్వహించే తేదీలు
ఈనెల 9, 10 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని 8 కాలనీల్లో 273 దుకాణాల వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. 15, 16 తేదీల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 10 కాలనీల్లోని 77 దుకాణాలకు, 15, 17 తేదీల్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీల్లోని 892 షాపులకు, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 6 కాలనీల్లోని 372 షాపులకు 15 నుంచి 18వ తేదీ వరకు, 21వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నారు. అదనపు సమాచారం కోసం ఆయా జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌లను సంప్రదించవచ్చని ఎండీ గౌతం సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




