– సొంతంగా ఈ నిర్ణయం తీసుకోలేరు
– రాహుల్ గాంధీ వెనుకనుండి నడిపించారు
– కడియంను బీఆర్ఎస్ ఎంతో గౌరవించింది
– కళ్లెదుట సాక్ష్యాలను కాదంటే ఎలా?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ లేనే లేదు.. శాసనసభ స్పీకర్ చేతుల్లో ఏమీ లేదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని నడిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు విషయంలో అసలు దోషి రాహుల్ గాంధీనేనని ఆరోపించారు. ఆయన అనుమతి లేకుండా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోలేరన్నారు రాహుల్ కి కొంచెమైనా సిగ్గు, గౌరవం ఉంటే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పై రాహుల్ తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని, రాహుల్ గాంధీ కూడా రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ దానికి రక్షకుడినని చెప్పుకుంటూ ఈరోజు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో రాహుల్ ఒక జోకర్ గా నిలిచిపోయారన్నారు. ఒక పార్టీ బీఫారంపై గెలిచిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బీఫారంతో ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించకుండా విచారణ పేరుతో సాగదీసి ఈరోజు ఆ ఎమ్మెల్యేకు అనుకూలంగా తీర్పు చెప్పడం అత్యంత దుర్మార్గం అన్నారు. ఒక పార్టీ బి-ఫారమ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బి-ఫారమ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు అని ప్రశ్నించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదని కెటిఅర్ వ్యంగ్యంగా అన్నారు. అన్ని సాక్ష్యాలు ముందున్నప్పటికీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని, ఆలోచించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అందుకే చేసేవి అనైతిక కార్యక్రమాలు చెప్పేవి నీతులు అన్న తీరుగా రాహుల్ తీరు ఉందన్నారు. ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపుల రాజకీయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందన్నారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ కాదా అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక ఫిరాయింపుల అంశంపై దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుందన్నారు. కడియం ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు.. కానీ, ఎలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ కి వచ్చారు, ఆయనకు బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, పదవులు ఏమిటో ప్రశ్నించుకోవాలన్నారు. శ్రీహరికి బీఆర్ఎస్ చేసిన అన్యాయం ఏంటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనను ఎంపీని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంను చేశారు. ఆపై ఎమ్మెల్సీని చేశారు. తర్వాత ఎమ్మెల్యేని చేశారు. ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ వయసులో ఇలాంటి మురికి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నాను, కేసీఆర్ నాయకత్వంతోనే ఉన్నానని మీరు చెప్పారు. ఈ “థర్డ్ క్లాస్” మాటలు ఎందుకు అని కెటిఅర్ ప్రశ్నించారు.
పేదల ఇళ్లు కూలగొట్టడం దారుణం
ఖమ్మంలోని వెలుగుమట్లలో మంత్రుల బినామీల ప్రయోజనాల కోసం వెయ్యిమంది పేదల ఇళ్లను కూలగొట్టడం అత్యంత దారుణమని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ భూమి చరిత్రను వివరిస్తూ, 1950వ దశకంలో భూదానోద్యమ స్ఫూర్తితో ఇద్దరు పెద్దలు 62 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారని, అందులో 31 ఎకరాలను గతంలోనే కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మిగిలిన భూమిలో చట్టబద్ధంగా పట్టాలు పొంది పదేళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఇప్పుడు కూల్చివేయడం ప్రభుత్వ వినాశకర ఆలోచనకు నిదర్శనమని విమర్శించారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ మంత్రుల విల్లాలకు అడ్డం వస్తుందనే నెపంతో మంత్రుల బినామీలైన వేజెళ్ళ సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావుల రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ఈ విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఒక శత్రు దేశం మీద దండయాత్రకు వెళ్లినట్లు 3,000 మంది పోలీసులతో తెల్లవారుజామున వచ్చి ఆడబిడ్డలు వేడుకుంటున్నా కనికరించకుండా ఇళ్లను నేలమట్టం చేయడం అమానుషమని కేటీఆర్ అన్నారు. బాధితులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించిన మంత్రుల తీరును నిరసిస్తూ అసలైన పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వ సొమ్మును పందికొక్కుల్లా దోచుకుంటున్న వారేనని మండిపడ్డారు. వెయ్యిమంది ఇళ్లను కూలగొట్టి ఇప్పుడు కేవలం 310 మందికి 75 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం ద్వారా మిగిలిన భూమిని ఎవరు నొక్కుతున్నారని నిలదీశారు. గతంలో 100 గజాల పట్టా ఉన్న వారికి ఇప్పుడు తక్కువ భూమి ఇవ్వడం ఏంటంటూ సర్కార్ నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని ఎద్దేవా చేశారు. బాధితులకు భోజనం పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, బాధితులను కిడ్నాప్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని, పోలీసులు తమ దాష్టికాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే ఇళ్లు కూలగొట్టారో అక్కడే తిరిగి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఆస్తి నష్టానికి ఒక్కో కుటుంబానికి ₹3 లక్షల తక్షణ నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు :మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని బీఆరఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. కాంగ్రెస్ రాజ్యాంగమని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతికి స్పీకర్ తీర్పు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును కాలరాసి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. కాంగ్రెస్ టికెట్ విÖద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్, కూతుర్ని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి, కండువా వేసుకుని తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని కోరిన కడియంకి క్లీన్‌చిట్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేయడమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా గాలికి వదిలేశాడని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





