ప్రేరణగా నిలిచే ‘నీల్‌ బత్తె సన్నాట’

– సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకోవాలి
– కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: నీల్‌ బత్తె సన్నాట అనే హిందీ సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకుని లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి పిలుపు నిచ్చారు. ఈ సినిమా ముఖ్యోద్దేశం ఏంటంటే అందులో తల్లి పాత్రలో ఒక పనిమనిషి ఉంటుందని, ఆమె కష్టపడుతూ తన కూతుర్ని ఐఏఎస్‌ వరకు చదివిస్తుందని చెప్పారు. సహజంగా డాక్టర్‌ కూతురు డాక్టరు, ఇంజనీరు కూతురు, ఇంజనీరుగా అవుతుంటారని, కానీ పనిమనిషి తన కుమార్తెను ఐఏఎస్‌ చదివించడం అధ్బుతమని, లక్ష్య సాధనకు ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. కరీంనగర్‌ ఫిలిం భవన్‌లో ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే చిల్డ్రన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీల్‌ బత్తె సన్నాట అనే హిందీ సినిమాను కేజీబీవీతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదర్శిస్తున్నామని, దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సినిమాలో కూతుర్ని చదివించేందుకు ఒక తల్లి పడ్డ కష్టం అంతాఇంతా కాదన్నారు. చదువు రాని తల్లి తన కూతురితో పదో తరగతి వరకు చదువుతుందన్నారు. ఈ సినిమాను విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ చూడాలని కోరారు. తల్లిదండ్రుల కష్టం విలువ తెలుసుకోండి.. కలలు కనండి.. కష్టపడండి.. వాటిని సహకారం చేసుకోండి.. జీవితంలో ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోండి అని విద్యార్థులకు ఉద్బోధించారు. విద్యార్థులు మంచి సంస్కారం అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని పమేలా సత్పతి పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూేచించారు. విద్యార్థులకు చిన్నప్పటినుంచే లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పరీక్ష ఉంటుందని, వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలన్నారు. సమాజంలో మంచి సంస్కారమంతమైన పౌరులుగా ఎదగాలన్నారు. అంతకుముందుకు కలెక్టర్‌ పమేలాకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్‌ ఆలపించిన చిన్నారి పిచ్చుక వీడియో ప్రదర్శనతోపాటు పంచతంత్ర బాలల చిత్రాన్ని ప్రదర్శించారు. భగవతి స్కూల్‌ విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, సలహాదారు వరాల మహేష్‌, ప్రధాన కార్యదర్శి లక్ష్మీగౌతమ్‌, ఉపాధ్యక్షుడు సయ్యద్‌ ముజఫర్‌, భగవతి విద్యాసంస్థల చైర్మన్‌ రమణారావు, అన్నవరం దేవేందర్‌, కందుకూరి అంజయ్య, వెంకటేశం, దశరథం, సురేష్‌, చెన్న అనిల్‌ కుమార్‌, పి.ఎస్‌.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *