– మయన్మార్కు భారతీయుల అక్రమ తరలింపు
– ఎదురు తిరిగితే చిత్రహింసలు
– సిట్ బృందాన్ని అభినందించిన టి.జి.సి.ఎస్.బి డైరెక్టర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: తెలంగాణకు చెందిన నిరుద్యోగులను మయన్మార్‌లోని మ్యవడ్డి ప్రాంతానికి అక్రమంగా తరలించి, అక్కడ వారిని బలవంతంగా వ్యవస్థీకృత సైబర్ నేరాల్లోకి దింపుతున్న ఐదుగురు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టి.జి.సి.ఎస్.బి)కు చెందిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (హెడ్ క్వార్టర్స్) అరెస్టు చేసింది. హైదరాబాద్, మైసూర్, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన ఈ నిందితులను సైబర్ క్రైమ్ పి.ఎస్, హెడ్ క్వార్టర్స్ లో వివిధ సెక్షన్ల కింద కింద అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వాసం గోవర్థన్, బానోతు మదన్‌లాల్, సయ్యద్ మహ్మద్ మదాని @మాక్స్, సుగ్గన సుధీర్ కుమార్, గంగల నవీన్ లు వున్నారు. విదేశాల్లో అధిక జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఏజెంట్లు తమ వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారంటూ గతనెల 22న బాధితులైన శరణ్ మరియు సంగీరెడ్డి జీవన్ రెడ్డిలు టి.జి.సి.ఎస్.బి కి ఫిర్యాదు చేశారు. తమను మయన్మార్‌లోని మ్యవడ్డి తరలించి, అక్కడికి చేరుకోగానే నిర్బంధించి పాస్‌పోర్ట్‌లను లాక్కొని, విదేశీయులు నిర్వహించే ఆన్‌లైన్ స్కామ్ కేంద్రాల్లో రోజుకు 16-18 గంటలు బలవంతంగా పని చేయించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత అక్టోబర్ 22న, మయన్మార్ ఆర్మీ పలువురు భారతీయ కార్మికులను అదుపులోకి తీసుకొని, 25 రోజుల పాటు ఒక హోల్డింగ్ క్యాంపులో ఉంచి, నవంబర్ 19న భారత రాయబార కార్యాలయానికి అప్పగించారు. థాయిలాండ్‌లోని మే సోట్ నుండి విమానంలో వారిని నవంబర్ 20న ఢిల్లీకి చేర్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమన్వయంతో వీరిని స్వదేశానికి రప్పించారు. తెలంగాణ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీగా ఉన్న టి.జి.సి.ఎస్.బి, 45 మంది బాధితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ విశ్లేషణ చేసి, వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. ఈ విచారణలో పలువురు వ్యక్తులు వివిధ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల ద్వారా ఈ దందా నడిపిస్తున్నట్లు తేలింది. ఈ ఫ్రాడ్ సెంటర్లలో బాధితులతో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ (పెట్టుబడి మోసాలు), డిజిటల్ అరెస్టులు, ఓ.టి.పి హార్వెస్టింగ్ మరియు రొమాన్స్ ఫ్రాడ్స్ వంటి నేరాలు చేయించేవారు. ఎదురుతిరిగితే చిత్రహింసలు పెట్టేవారు. దీనిపై టి.జి.సి.ఎస్.బి క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం వీరిని అరెస్ట్ చేసింది. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ ఎస్పీ కె.వి.ఎమ్ ప్రసాద్, సిట్ సభ్యులు ఎన్. వేణుగోపాల్ రెడ్డి , డిప్యూటీ ఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీ నారాయణ, దత్తాద్రి మరియు ఎస్.ఐలు రాము నాయక్, శ్రవణ్ కుమార్‌లను టి.జి.సి.ఎస్.బి డైరెక్టర్ అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





