రాష్ట్రానికి పాలసీ కోసమే ‘విజన్‌’ డాక్యుమెంట్‌

– అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– కార్యదర్శుల పనితీరుపై ప్రతినెలా సీఎస్‌ సమీక్షలు
– ప్రతినెలా చీఫ్‌ సెక్రటరీకి నివేదికలు ఇవ్వాలి
– సచివాలయ ముఖ్య విభాగాల కార్యదర్ళుల సమావేశలో సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది.. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌, హెల్త్‌ వంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నామని చెప్పారు. సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని, స్పష్టమైన విధివిధానాలతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలని అన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలంటూ ప్రతి నెలా కార్యదర్శుల పనితీరుపై సీఎస్‌ సమీక్షిస్తారని తెలిపారు. కార్యదర్శులు సీఎస్‌కు ప్రతి నెలా నివేదిక సమర్పించాలని, ప్రతీ మూడు నెలలకొకసారి మీ పనితీరుపై తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావన్నారు. సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని, అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతీ సెక్రటరీ వారివారి శాఖల్లో ఉన్న రెగ్యులర్‌, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26లోగా సీఎస్‌కు అందించాలని అధికారులను ఆదేశించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హెచ్‌వోడీలు తనిఖీ చేయాలని, ఈ ప్రక్రియను జనవరి 26లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఆ భవనాలను ఖాళీ చేసి జనవరి 26లోపు ప్రభుత్వ భవనాల్లోకి మారాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *