రెండు మున్సిపాలిటీల్లో మరోసారి వాయిదా

=కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఘర్షణ
– డ్రాలో కాంగ్రెస్కే లక్!
– పది మున్సిపాలిటీల్లో హస్తం హవా
– అన్నింటా కాంగ్రెస్ చైర్మన్ల ఎన్నిక
– మా మున్సిపాలిటీలను లాక్కుంటున్నారు: ఎర్రబెల్లి

                                                            (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

మరోసారి రెండు మున్సిపల్టీలకు సంబంధిం చిన చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈ రెండు మున్సిపాల్టీల ఎన్నికలను మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. సోమవారం అన్ని మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉండగా హంగ్ ఏర్పడిన 11 మున్సిపాలిటీల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణంతో మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో క్యాతనపల్లి, ఖనాపూర్ మున్సిపాలి టీల ఎన్నికలను వాయిదా వేశారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలమధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. తమ పార్టీనుంచి గెలిచిన వ్యక్తులతో మున్సిపాల్టీ కార్యాలయానికి చేరుకుంటున్న బీఆర్ఎస్ నాయకులను పోలీ సులు అడ్డుకోవడంతో గందరగోళం ఏర్ప డింది. స్థానిక ఎంఎల్ఎ కోవ లక్ష్మీ, మాజీ ఎం ఎల్యే బాల్క సుమన్ ఈ విషయంలో పోలీసులతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. తమకు సం పూర్ణ మెజార్టీ ఉందని, గెలిచిన తమ వారిని తీసుకువెళ్తుంటే పోలీసులు అనవసరంగా అడ్డుకోవడాన్ని ఆక్షేపించారు. దాo తో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు చేయగా కాంగ్రెస్ కార్యకర్తలుకూడా బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేయడంతో పరిస్థితి తీవ్రతరంగా మారింది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని అందరిని అక్కడినుంచి పంపివేస్తుండడంతో ఇరువర్గాలవారు పోలీసులతో ఘర్షణ పడ్డారు. కొందరు రాళ్ళు విసరడంతో ఒక పోలీసు కానిస్టేబుల్తోపాటు మరికొందరికి దెబ్బలు తగిలాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపి వంశీకృష్ణ కార్లు దెబ్బతి న్నాయి. దాంతో పోలీసులు లాఠీఛార్జి చేయగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సంపూర్ణ మెజార్టీ తమకున్నా ఎన్ని కలను వాయిదావేస్తూ అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చే శారు. ఎట్టి పరిస్థితిలో క్యాతనపల్లిలో తమ గులాబి జెండా ఎగురాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులుండగా బీఆర్ఎస్ 14 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఏడు స్థానాలను, సిపిఐ 4, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటినుండి బిఆర్ఎస్ తమ 14 మంది కౌన్సిలర్లను కాపాడుకుంటూ వస్తున్నది.  వారిని కాంగ్రెస్ ఎక్కడ కొనుగోలుచేస్తుందోనని వారందరిని బాల్క సుమన్ తన స్వగృహంలో జాగ్రత్త చేసుకుంటూ వచ్చారు. సోమవారం వాయిదాపడి మంగళవారం మళ్ళీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభంకాగానే తమవారిని జాగ్రత్తగా తీసుకువస్తుండగా పోలీసులు నిరోధించారు. ఇక్కడ పరిస్థితి తమకు అనుకూలంగా లేదన్న అభిప్రాయంగా మంత్రి వివేక్ ఎన్నికను మరోసారి వాయిదా వేయాలని చెప్పినందునే ఎన్నికల అధికారులు వాయిదా వేశారంటూ సుమన్ ఆరోపించారు. మంత్రి చెప్పినట్లు ఎన్నిక వాయిదా వేసినట్టైతే ఎన్నికలెందుకు, దానికి అధికారులెందుకని ప్రశ్నిస్తున్నారు. ఖానాపూర్లో కోరంలేకపోవడంతో మరోసారి ఇక్కడ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా బీఆర్ఎస్, బీజేపీ చెరి నాలుగు స్థానాలను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 3 స్థానాల్లో, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. కాగా కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేయగా బిజెపి, బీఆర్ఎస్ ల నుండి గెలిచినవారు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికా రులు మరోసారి వాయిదా వేశారు.

హంగ్ మున్సిపాల్టీల్లోనూ కాంగ్రెస్ పై చెయ్యి

హంగ్ మున్సిపాల్టీల్లోనూ కాంగ్రెల్దే పై చెయ్యి కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రాష్ట్రంలోని 11మున్ని పార్టీల్లో ఎవరికీ సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో సోమవారం జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను వాయిదా వేశారు. అయితే మంగళవారం తిరిగి ఎన్నికకు అవకాశం కల్పించగా కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. మంగళవారం కూడా 11 మున్సిపాల్టీల్లో రెండు మినహా తొమ్మిది మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో ఏడింటిని కాంగ్రెస్ స్వంతం చేసుకుంది. సుల్తానాబాద్, కాగజ్ నగర్, జహీరాబాద్, డోర్నకల్, జనగామ, తొర్రూరు, ఇల్లందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలచు కోగా, ఇబ్రాహింపట్టణం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో గులాబి జండాను ఎగురవేశారు. కాగా క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నిక మరోసారి వాయిదాపడింది.

లక్కీ డ్రాలో లక్కీ చాన్స్ కొట్టిన కాంగ్రెస్

హంగ్ మున్సిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్కు సమాన ఓట్లు ఉండడంతో ఎవరికి వారు సంబంధిత మున్సిపాలిటీలను తమ హస్తగతం చేసుకోవాలని తీవ్రాతితీవ్రంగా పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఘర్షణ, నిర్భందాలు, రాళ్ళదాడి చోటుచేసుకున్నాయి. ప్రధానంగా జనగామ, తొర్రూర్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తొర్రూర్లో ఈఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పోలీసులు నిర్భందించడంతో పెద్ద గొడవకు దారితీసింది. ఇక్కడ 16 స్థానాలకుగాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలను సాధించుకున్నాయి. అయితే స్థానిక ఎంఎల్యే యశస్వినితోపాటు ఎంపి కడియం కావ్య ఎక్స్ అఫియో ఓటును వినియోగించుకోవడంపై తీవ్ర ఘర్షణ ఏర్పడింది. కావ్య మరోచోట తన ఓటును వినియోగించుకోవడంవల్ల ఇక్కడ ఆమె ఓటు చెల్లదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటించింది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా లక్కీ డ్రా తీయడంతో కాంగ్రెస్కు లక్కీ ఛాన్స్ తగిలింది. ఛైర్మన్ గా కాంగ్రెస్కు చెందిన శ్రవణ్ ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కాగా అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్ మోసం చేసిందని, తమకు దక్కాల్సిన మున్సిపాలిటీని కుట్రచేసి లాక్కుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీటి పర్యంతమయ్యారు.
జనగామలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అక్కడకూడా లక్కీ డ్రా లో కాంగ్రెస్కే లక్కీ ఛాన్స్ లబించింది. ఇక్కడ కూడా కాంగ్రెస్, బిఆర్ఎస్లకు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా తీయాల్సి వచ్చింది. జనగామలో 30 స్థానాలకుగాను బిఆర్ఎసు 13 స్థానాలతోపాటుగా 2 ఇండిపెండెంట్ల మద్దతుంది. దీంతో ఆ పార్టీకి 15 ఓట్లు రాగా, కాంగ్రెస్ 12 స్థానాలకుతోడు సిపిఎం ఒక స్థానం, ఇండిపెండెంట్లు ఇద్దరి మద్దతుతో ఆ పార్టీకి కూడా 15 ఓట్లు ఉన్నాయి. ఎక్స్ అఫిషియోల ఓట్లు కూడా సమానంకావడంతో ఇక్కడ కూడా డ్రా తీయాల్సి వచ్చింది. డ్రాలో కాంగ్రెస్ బెనిఫిట్ పొందగా, ఆ పార్టీ నుంచి కడకంచి బాలమణి చేర్మన్గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *