– 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించాలి
– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఆదేశించారు. జూన్ 12 వరకు నిర్వహించే ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 12న కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కెశ్రీదేవి, సెర్ప్ సీఈఓ దివ్య, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌లు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే ఉటంకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏవిధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో ఆ కోణంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్లాగ్‌షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపల్ సంస్థలు ఉన్నాయని, వీటన్నింటిలో 15 వేలమంది ప్రజాప్రతినిధులున్నారని వివరించారు. ఈ శిక్షణ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలలను కూడా ఆహ్వానించాలని సీఎస్ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే ఫొటో ప్రదర్శనను కూడా వేదిక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఫైళ్ల క్లియరెన్స్, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్లను రామకృష్ణారావు అభినందించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ తమ విధులు బాధ్యతలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సర్పంచుల పాత్ర తదితర అంశాలపై శిక్షణ నిర్వహించాలన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ సిటిజన్ చార్టర్, మున్సిపల్ చట్టాలు, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం, అమృత్ తదితర కార్యక్రమాలపై మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ ఈనెల 12న ఏర్పాటు చేసే శిక్షణకు సంబంధించి సవివరమైన నోట్‌ను ఇప్పటికే కలెక్టర్లకు పంపామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




