ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఓంకార్

– ప్రజా ఉద్యమాల్లో ఆరితేరారు
– ఓంకార్ శతజయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేని లోటు నర్సంపేటకే కాదు.. యావత్ తెలంగాణకు తీరని లోటు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఓంకార్ లాగే తాను కూడా తుపాకీ పట్టానని, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఉద్యమాల్లో, ఎమ్మెల్యేగా ఓంకార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉద్యమాలు, క్రమశిక్షణ విలువలు ఆయన నుంచి నేర్చుకున్నానంటూ ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఏ శక్తులకూ లొంగకుండా రాజకీయాలకు విలువలు అద్దిన రాజకీయ దురంధరుడు అని మంత్రి సీతక్క కొనియాడారు. నిత్యం ప్రజల కోసం జీవించిన ఆదర్శప్రాయుడని, ప్రజా సమస్యలపై చట్టసభలలో ప్రజా గళం వినిపించిన నిస్వార్ధ ప్రజా సేవకుడని చెప్పారు. అలాంటి ప్రజా నాయకుడి చరిత్ర గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, గద్దర్, అందెశ్రీ వంటి వారి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియచెబుతున్నాం.. అదే రీతిలో ఓంకార్‌ను రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ట్యాంకుబండు మీద ఓంకార్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆయన అభిమానుల ఆకాంక్షను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, తన వంతు సహాయసహకారాలు అందజేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కాగా, అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేస్తునా ఖండించలేని పరిస్థితుల్లో మన దేశ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఒక దేశ అధినేతను చంపే హక్కు అమెరికాకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇప్పుడు మనం మాట్లాడకపోతే మన కోసం ఎవరూ మాట్లాడరన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *