– భారత్‌ను అనుమతించిన అమెరికా వాణిజ్య శాఖ
– ఇంధన సంక్షోభానికి తెరదించే యత్నంగా వెల్లడి
వాషింగ్టన్, మార్చి 13: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది. రష్యా చమురు కొనుగోలుకు స్వల్పకాలికంగా అనుమతినిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రంలో నిలిచిపోయిన చమురును కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 11 వరకు అవకాశం కల్పించింది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్న తరణంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకు రావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ’ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ’ప్రపంచ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని పెంపొందించడం, ధరలను అదుపులో ఉంచేందుకే ట్రంప్ ఈ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి సముద్రంలో నిలిచిపోయిన చమురు రవాణాకు మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయి’ అని బెసెంట్ స్పష్టం చేశారు. రష్యాపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటి కీ అమెరికా తాత్కాలిక సడలింపులతో పుతిన్ ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని బెసెంట్ అన్నారు. రష్యాకు వచ్చే ఆదాయంలో అధిక భాగం చమురు వెలికితీసే సమయంలోనే పన్నుల రూపంలో అందుతుందని, ఇప్పుడు రవాణాలో ఉన్న చమురు అమ్మకం వల్ల వారికి అదనపు ప్రయోజనమే ఉండదని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వల్ల స్వల్పకాలికంగా ధరలు పెరిగినా.. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తాజా సడలింపులతో మార్చి 12 నాటికి నౌకల్లో లోడ్ అయిన రష్యా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను ఏప్రిల్ 11 వరకు విక్రయించుకోవచ్చు. గతంలో అమెరికా ఆంక్షలు విధించిన రష్యన్ సంస్థల నుంచి ఉత్పత్తైన చమురును కూడా ఇప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు. ఇకపోతే ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇరాన్ ఉపశమనం కలిగించింది. భారతీయ ట్యాంకర్లను హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన చర్చల అనంతరం.. భారత జెండాలు కలిగిన నౌకలకు టెహ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పలు డియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కుంటున్నప్పటికీ.. పుష్పక్, పరిమళ్ అనే రెండు భారతీయ ట్యాంకర్లు వ్యూహాత్మకంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు పేర్కొన్నాయి.అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సంబంధంలేని నౌకలకు మాత్రం ఆంక్షల నుంచి సడలింపునిచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారతీయ నౌకలు జలమార్గం గుండా సురక్షితంగా ప్రయాణించడం విశేషం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


