రేపు నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

– ప్రారంభోత్స‌వం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
– ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల, పొన్నం సమీక్ష
– రైతు మహోత్సవాలకు భారీగా తరలి రావాలని పిలుపు
– ఉత్తర తెలంగాణకుఈ కేంద్రం కీలకం

సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 21: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న ఆయిల్ రేపు పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. ముందుగా హెలిప్యాడ్‌ను పరిశీలించి భద్రతపై పోలీసులకు సూచనలు చేసిన మంత్రులు అనంతరం ఫ్యాక్టరీ ప్రాంగణానికి వెళ్లి ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను సందర్శించి ముఖ్యమంత్రి సందర్శించనున్న ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన జరిగే ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. చివరగా సభా స్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆయిల్ పామ్ అభివృద్ధికి తాను స్వయంగా రైతుగా ఫ్యాక్టరీ నిర్మాణానికి పూర్తి కార్యదీక్ష చేపట్టారని, స్వయంగా చాలాసార్లు ఫ్యాక్టరీ పరిశీలించారని, గుజరాత్‌లో పాలకు కురియన్ మాదిరి ఆయిల్ పామ్‌కి మంత్రి తుమ్మల అని కొనియాడారు. ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని, వర్షాల ప్రభావం తక్కువగా ఉండటంతోపాటు కోతుల బెడద కూడా ఉండదని తెలిపారు. ఉత్తర తెలంగాణలో సాగు చేసిన రైతులకు ఈ ఫ్యాక్టరీ ప్రధాన కేంద్రంగా మారుతుందని చెప్పారు. రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

నా మొదటి సంతకం ఆయిల్ పావమ్ ఫ్యాక్టరీపైనే 

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో కీలకం కానుందని, సుమారు రూ.300 కోట్లతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ తక్కువ సమయంలో పూర్తయిందని తెలిపారు. గంటకు 30 నుండి 120 టన్నుల వరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారాన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించినట్లు చెప్పారు. నాలుగైదేళ్లుగా 30 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు వచ్చారని, ప్రైవేట్ కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మొదటి సంతకం చేశానని, 32 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పడిందని, 16 నెలల్లోనే పూర్తి చేసిన దేశంలోనే మొదటి ఫ్యాక్టరీ ఇది అని చెప్పారు. గతంలో పండించిన పంటలను దూరప్రాంతం అశ్వారావుపేట తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు సిద్దిపేటలోనే ప్రాసెసింగ్ జరుగుతుందని తెలిపారు. వ్యర్థాల ద్వారా 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. రైతులు విక్రయించిన మూడు రోజుల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ పామ్ నూనె ప్రధానంగా ఇక్కడినుంచే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. మల్లన్న సాగర్ రాకముందే ఇక్కడ మొక్కలు పెట్టారు.. ఈ ఫ్యాక్టరీ ప్రజలది.. కాళేశ్వరానికి జీవనాడి ఎల్లంపల్లి.. ఎక్కడినుండి ఎక్కడికి నీళ్లు తరలించాలన్నా ఎల్లంపల్లి కీలకం.. ఎల్లంపల్లి నిర్మించింది కాంగ్రెస్ పార్టీ.. ఎల్లంపల్లి నుండి నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే స్విచ్ వేరే ప్రభుత్వం వాళ్ళు నొక్కారు అని బీఆర్‌ఎస్‌నుద్దేశించి అన్నారు. ‘నా స్థానంలో ఎవరున్నా ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చేది.. ఇక్కడైతేనే ప్రజలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రితో చెప్పి నిధులు మంజూరు చేయించా.. తాను వచ్చిన తరువాత ఐదు ఫ్యాక్టరీలు సంతకం చేసిన.. ముందుగా పూర్తి చేసింది నర్మెట.. ఈ ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ రెమ్యునరేషన్ నుండి కట్టాం’ అని మంత్రి తుమ్మల చెప్పారు. పదేళ్లల్లో మీరు చేసిన రుణ మాఫీ కరెక్ట్ అయితే మీకు ఈ గతి పట్టి ఉండేది కాదని బీఆర్‌ఎస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాలుగు దఫాలుగా డబ్బులు వేయడం వల్ల రైతుపై రుణ భారం పడిందన్నారు. ‘మేము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు ఉన్న 25 లక్షల మంది రైతులకు ఒకేసారి రుణ మాఫీ చేశాం.. 25 లక్షల మంది పేర్లు శాసనసభలో పెట్టాం.. దేశంలో మొదటిసారి రూ.21,671 కోట్లు ఒకేసారి రుణ మాఫీ చేసిన చరిత్ర దేశంలో తెలంగాణది ఒక్కటే. సాంకేతిక సమస్యతో రుణ మాఫీ కాని వారికి మహబూబ్‌నగర్ సభ వేదికగా మళ్ళీ రూ.3 వేల కోట్లు ఇచ్చాం.. తరువాత ఏ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు.. రెండేళ్లల్లో రేవంత్ రెడ్డి ఏం చేశారో ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనం‘ అన్నారు. కోహెడ మొక్కజొన్న రైతులు అడగగానే కొనుగోలు కేంద్రాలు తెరిచాం.. కానీ తమ వల్లే తెరిచారని మీరు ప్రకటించుకున్నారు.. ఎప్పటికీ అబద్ధాలు ఆడడమేనా అని మంత్రి నిలదీశారు. దేశంలో తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఎన్ని పూర్తి చేశారు.. దళితులకు మూడెకరాలు ఏమైంది.. దళిత బంధు ఏమైంది అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఇచ్చంపల్లి, దుమ్మగూడెంపై అనాటి కేబినెట్‌లోనే చెప్పా.. మీ అవినీతి కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు అని ఆరోపించారు. ఎన్నికల ముందు మంజూరు చేసిన పథకాలను ఎక్కడా ఆపలేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రిఫైనరీకి శంకుస్థాపన జరుగుతుందని, రైతాంగ మహోత్సవాలకు రైతులు భారీగా హాజరుకావాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రూ.3,600 కోట్లు రైతు భరోసాగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదలవుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *