ఆయిల్ పామ్ సాగుతో రైతుల‌కు మహర్దశ

– ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో సాగు
– రూ.456 కోట్లు కేటాయింపు
– స్వ‌యంస‌మృద్ధికి  70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి
–  మంత్రి తుమ్మల

కామారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,ఫిబ్ర‌వ‌రి 20: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి మహర్దశ పట్టనుందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పాల్వంచమర్రి గ్రామంలో ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖతోపాటు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం  నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సింగిరెడ్డి బలరాం వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ సంప్రదాయ పంటలతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆయిల్ పామ్ సాగు దీర్ఘకాలిక లాభాలను అందిస్తుందని తెలిపారు. పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.88 లక్షల ఎకరాల్లో సాగు ఉన్నదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 32,923 మంది రైతులు 1,05,455 ఎకరాల్లో ఈ పంట సాగును చేపట్టారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు రూ.456 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తుండగా, సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మాణం పూర్తయిన ఫ్యాక్టరీ త్వరలో అందుబాటులోకి రానుందని మంత్రి చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టాలనుకునే రైతులకు మొక్కలు, ఎరువులు, డ్రిప్ సౌకర్యాలను ప్రభుత్వం రాయితీ మీద అందిస్తుందని, రైతుకు ఎకరాకు రూ.51,000 సబ్సిడీ రూపంలో అందచేయడం జరుగుతున్నదని, అందుబాటులో ఉన్న ఈ అవకాశాలను వినియోగించుకుని రైతులు పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని మంత్రి సూచించారు. కామారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాలకు పైగా సాగును విస్తరించేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పంట ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని, మార్కెట్ సమస్యలు లేకుండా సాగు చేయగల పంట ఇదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల మాదిరి కామారెడ్డి జిల్లా కూడా ఆయిల్ పామ్ సాగులో ముందంజలో నిలవాలని సూచించారు. హిందుస్థాన్ యూనిలీవర్ ప్రతినిధి వరుణ్ మెహత మాట్లాడుతూ కంపెనీ తరపున సాగు, మార్కెటింగ్‌కు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. డ్రిప్ సౌకర్యానికి అదనంగా కంపెనీ ద్వారా రూ.5,000 ప్రోత్సాహకంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ మదన్ మోహన్, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని, జిల్లా గ్రంథాలయ సంస్థ‌ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, మున్సిపల్ చైర్‌పర్సన్, సర్పంచ్ శేకర్ తదితరులు పాల్గొన్నారు. హిందుస్థాన్ యూనిలీవర్ ప్రతినిధులు విల్లెం యూజెన్, యోగేష్ మిశ్రా, విపుల్ పాటిల్, వరుణ్ మెహత, సుందర్ మహాజన్ కూడా హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *