గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ప్రత్యేకత

– పరేడ్‌లో ఒగ్గుడోలు ప్రదర్శనకు అనుమతి
– దిల్లీ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్న కళాకారులు

న్యూదిల్లీ, జనవరి 24: దేశ రాజధాని దిల్లీలో జరిగే 77వ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ బిడ్డలు ప్రత్యేకంగా నిలవబోతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దేశాధిపతుల ముందు తెలంగాణకే సొంతమైన కళారూపాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటివరకు ఎన్నో కళారూపాలు రిపబ్లిక్ డేలో పాల్గొన్నా తొలిసారి ఒగ్గుడోలు విన్యాసానికి చోటు దక్కింది. ఈ ప్రదర్శన కోసం సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి ప్రఖ్యాత ఒగ్గు డోలు కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి బృందానికి ఆహ్వానం అందింది. దీంతో ఆయన నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది కళాకారులు ఈనెల 8నే దిల్లీకి చేరుకున్నారు. ఎముకలు కొరికే చలిలో దాదాపు 15 రోజులుగా కర్తవ్య పథ్‌పై ప్రాక్టీస్ చేస్తున్నారు. సుమారు వందమంది కళాకారులు దేశంలోని వివిధ కళారూపాలతో కలిపి ఏక్ భారత్ అనే కాన్సెప్ట్‌తో కళారూపాన్ని ప్రదర్శించనున్నారు. త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, దిల్లీ పోలీస్ కంటింజెట్లకు ఏమాత్రం తీసిపోకుండా కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌సిసి విద్యార్థులు ఈసారి కవాతు చేయబోతున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 133మంది పాల్గొంటున్నారు. ఈ టీంను కవాడీగూడకు చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి భరత్ లీడ్ చేయబోతున్నాడు. డిసెంబర్ 27న దిల్లీ వచ్చిన ఈ టీం దాదాపు నెల రోజులుగా కర్తవ్య పథ్‌పై కవాతు చేస్తోంది. భారత గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారిగా భారతీయ సినిమా అపూర్వమైన రీతిలో జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోసం సినీ శకటాన్ని రూపొందించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ ఉత్సవాల్లో ప్రముఖ సినీ దర్శకుడు ఈ ప్రత్యేక సినీ శకటానికి ప్రాతినిధ్యం వహించడం విశేషం. ‘భారత్ గాథ’ అనే భావనతో తీసుకువస్తున్న ఈ శకటానికి కొత్తగా స్వరపరిచిన, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట తోడవుతుంది. జీవన సాంస్కృతిక కథనంగా సినిమా పట్ల భన్సాలీ దార్శనికతకు ఇదొక తార్కాణంగా నిలుస్తుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *