ఒక్క‌సారిగా వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ అధికారుల అంచనా . 

ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ప్రమాదానికి కారణమేంటనే దానిపై స్పష్టత రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఇంధ‌న ట్యాంకు పేలిపోవ‌డంతో ఒక్క‌సారిగా అగ్నిగోళం ఏర్ప‌డింది. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడే పరిస్థితి లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా వెల్లడించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి ఒకరు స్పందించారు. ప్రమాదం గురించి సమాచారం రాగానే మధ్యాహ్నం 2-2.30 గంటల ప్రాంతంలో త‌మ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. అంతకుముందే హాస్టల్‌లో శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు కాపాడారు. మంటలు వ్యాపించడం ఎక్కువైన తర్వాత పరిస్థితి చేదాటిపోయిందని ఆ అధికారి వివరించారు. గతంలో తాము ఎన్నో సహాయక చర్యలు చేపట్టినా ఇలాంటి విపత్తును ఇంతకుముందెప్పుడూ చూడలేద‌న్నారు.తాము  పీపీఈ కిట్లు వేసుకొని ఘటనాస్థలానికి చేరుకున్నా, వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింద‌న్నారు.
……….
ఈ ఉష్ణోగ్రత తీవ్ర‌త‌కు పక్షులు, శునకాలు కూడా త‌ప్పించుకోలేక‌పోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు పక్షులు, శునకాలు కాలిబూడిదయ్యాయి.  ఎటుచూసినా శిథిలాలే కన్పించాయి. వాటి కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికులను గుర్తించడం సవాల్‌గా మారిందని మరో అధికారి ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్నారు.  ప్రమాదం ధాటికి చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. దీంతో డీఎన్‌ఏ ‌పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *