చెట్లు పెట్టడం రామయ్య వొంతు..నరకడం రేవంత్ వొంతు
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలి
ఏ ఊర్లో అయినా పూర్తి రుణమాఫీ జరిగిందని చూపిస్తే ముక్కు నేలకు రాస్తా
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన తప్పుడు పనులకు అధికారులు బలయ్యే పరిస్థితి ఏర్పడిందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హాట్ కామెంట్ చేశారు. గత నాలుగు రోజుల కిందట సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు, చిన్నకోడూరు మండలంలోని వివిధ గ్రామాల అకాల వర్షం, రాళ్లవాన వల్ల దెబ్బతిన్న పంట పొలాలను, మామిడి, కూరగాయల తోటలను హరీష్‌రావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. రాళ్ల వానతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సిఎం అయ్యాక హార్టికల్చర్ యూనివర్సిటీలో చాలా ఎకరాల్లో చెట్లను నరికివేశాడని తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియూ)లో గల 400ఎకరాలలో చెట్లను నరికాడని, దీంతో సంబంధిత అధికారుల ఉద్యోగాలు పోవడమే కాకుండా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల బిఆర్‌ఎస్ పార్టీపక్షాన తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నానంటూ.. చెట్ల నరికే రేవంత్‌రెడ్డి చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందన్నారు. రామయ్య, ఆయన భార్య అడవుల పెంపకం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులనీ, చెట్టు పెట్టడం రామయ్య వొంతు అయితే, వాటిని నరకడం రేవంత్‌రెడ్డి వొంతు అయిందన్నారు. ప్రతి క్షణం ఒక్కొక్క చెట్టును కాపాడడానికి రామయ్య ఎంతో ప్రయత్నం చేశాడని తెలిపారు.
రైతుల పంట రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నానని, ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పాలనీ, పోలీస్ గన్‌మెన్లు లేకుండా, పోలీస్ బందోబస్తు లేకుండా ఏ ఊరికి వెళ్దాం రండి, రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూద్ధామంటూ సవాల్ విసిరారు. సిఎం రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని, నేను మొన్న అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అడిగాను. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏ ఊరికి వెళ్దామో రండి. లేదంటే మధిర నియోజకవర్గంలోని ఏ ఊరికి రమ్మంటారో చెబితే వొస్తానని చెప్పా. అందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నానన్నారు. నరసయ్య అనే రైతుకు రైతుబంధు పడలేదు, రుణమాఫీ కాలేదు. పైగా వడగండ్ల వానకు పంట నష్టపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత వారం 3,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తంగా 12 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. చిన్నకోడూరు మండలంలో రుణమాఫీ జరిగిన రైతులు 5,300 మంది ఉంటే ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదన్నారు. ప్రభుత్వం నిజంగా పంటల బీమా చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదనీ, రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చెల్లిస్తామని బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించిందని, పంటల బీమా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందనీ, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు.
చిన్నకోడూరు మండ)ంలోని ఇబ్రహీంనగర్ గ్రామం) ఏ రైతును అడిగినా రుణమాఫీ కాలేదనే చెప్తున్నారనీ, 40 శాతం మందికి రుణమాఫీ జరిగితే 60శాతం మందికి జరగలేదన్నారు. రైతుబంధు విషయంలో కూడా సగం మంది రైతులకు అందలేదన్నారు. వడగండ్ల వానకు సిద్ధిపేట జిల్లాలోని రైతాంగానికి తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. వడగండ్ల వానకు నష్టపోయిన పంటల్లో రకరకాల పంటలు ఉన్నాయి. వరితో పాటు మిర్చి, టమాటా, కూరగాయల పంటలు చాలా ఉన్నాయనీ, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రైతులందరినీ ఆదుకోవడంతో పాటు వొచ్చే వాన కాలంలో విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, ఎకరానికి 25 వేల ఇన్పూట్ సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండు చేశారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కూర మాణిక్యరెడ్డి, కాముని శ్రీనివాస్, ములకల కనకరాజు, కీసరి పాపయ్య, సూరగోని రవిగౌడ్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
ఆందోళన చెందొద్దు…అండగా ఉంటా..
చిన్నకోడూరు మండలంలోని ఎల్లాయిపల్లి, కమ్మర్లపల్లి, కొత్తపల్లి, కొచ్చర్ల, చెల్కలపల్లి తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల రాళ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను, మామిడి దోసకాయ తోటలను హరీష్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలువురు రైతులు, మహిళా రైతులు తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ గోడును హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లగా..జరిగిన నష్టాన్ని చూసి చలించి, ఆవేదన చెందిన హరీష్‌రావు మీరెవరూ ఆందోళన చెందొద్దు… అండగా ఉంటానని ఆత్మవిశ్వాసం నింపారు.




