– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– ములుగులో పోషణ మాస మహోత్సవం ప్రారంభం
ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. పోషణ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధి కోసం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరేలా అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడిరచారు. పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పోషకాహారం అందించే చర్యలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. జంక్ ఫుడ్, చక్కెర, ఉప్పు, నూనె అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ‘వోకల్ ఫర్ లోకల్’ ద్వారా గ్రామీణ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించాలని మంత్రి సూచించారు. వేసవిలో అంగన్‌వాడీ సిబ్బందికి సెలవులు ఇచ్చినట్లు, మినీ అంగన్‌వాడీలను మెయిన్ సెంటర్లుగా మార్చినట్లు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్ లేదా హెల్పర్ మరణిస్తే అంత్యక్రియల ఖర్చు భరిస్తున్నామని, రిటైర్మెంట్ ప్రయోజనాలు రెట్టింపు చేసినట్లు గుర్తుచేశారు. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేపడతామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను కాపాడే బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు. నాసిరకం సరకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ పెడతామని హెచ్చరించారు. పోషణ తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత.. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమే ఈ పోషణ మాసం ప్రధాన ఉద్దేశ్యం అని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కలెక్టర్ టీ.ఎస్.దివాకర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వరంగల్ రీజనల్ హెడ్ శ్రీధర్, సంక్షేమ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





