– సమష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యం
– భాగస్వామ్య పక్షాల రాష్ట్రస్థాయి సమావేశంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14 : షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలుపంచుకోవాలని పిలపునిచ్చారు. సమష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యపడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతామని, తెలంగాణ రైజింగ్ -2047 డాక్యుమెంట్‌కు అనుగుణంగా అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి సేవల బలోపేతం, చిన్నారుల్లో పోషకాహార మెరుగుదల, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశం బేగంపేటలోని టూరిజం ప్లాజా వేదికగా సోమవారం జరిగింది. సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించారు. పోషకారంపై పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, సీఎఫ్‌టిఆర్‌ఐ (మైసూర్), ఎయిమ్స్, ఇక్రిసాట్, యూనిసెఫ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ప్రథం, ఆంధ్ర మహిళా సభ, హర్మన్, బాల రక్షభారతి వంటి స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, పోషకాహారం అందించడంలో లైన్ డిపార్ట్‌మెంట్లుగా వ్యవహరిస్తున్న పలు సంక్షేమ శాఖలు, సివిల్ సప్లైస్, విద్యా శాఖ, టీజీ ఫుడ్స్, సెర్ప్, ఐ అండ్ పీఆర్ శాఖల ఉన్నతాధికారులు పాల్గోని తమ విలువైన అభిప్రాయలు తెలియజేశారు. వారి సూచనలతో తెలంగాణ పోషకాహార ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ లబ్ధిదారులకు రోజుకు 200 మి.లీ విజయ పాలు, కిశోర బాలికలకు పోషకాలతో కూడిన పల్లీ, తృణ ధాన్య పట్టీలు, వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్ఫష్టం చేశారు. నిపుణుల అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా పోషణ తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందించి, అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను, ప్రజా ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల సేవల్లో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీల్లో ఎన్నో పోషకాలున్న కోడిగుడ్డు సరఫరాను నిలిపిపేయగా తెలంగాణలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిపుణుల సలహా మేరకు అన్ని వయసుల వారికి పౌష్టికాహరం అందించే అంశం పరిశీలనలో ఉందన్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడిరచారు. నాక్, జెన్‌ఎన్‌టీయూ వంటి సంస్థలు మోడల్స్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వలస కూలీల పిల్లలకు పౌష్టికాహరం అందించేలా మొబైల్ అంగన్వాడీలు నిర్వహిస్తామన్నారు.
సీడ్స్ కిట్ ఆవిష్కరణ
పోషణ్ వాటిక కార్యక్రమం కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మొదటి విడతలో 4,500 అంగన్వాడి కేంద్రాలకు ఈ విత్తనాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, బెండకాయ విత్తనాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో వీటిని పెంచి లబ్దిదారులకు వండి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి.సృజన, తెలంగాణ ఫుడ్ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, ఇతర శాఖల ఉన్నతాధికారులు, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పాల్గోన్నారు.



