హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: ఆరోగ్య శాఖలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తి అయింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి సెలక్షన్ లిస్టును బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/Home) అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. పారదర్శకత కోసం పరీక్ష రాసిన సుమారు 42 వేల మంది అభ్యర్థుల పూర్తి వివరాలను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో 2024లో 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేసింది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సుల కొరత పూర్తిగా తీరినట్టేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
రికార్డు స్థాయిలో నియామకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో 12,649 పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల, ల్యాబ్ టెక్నీషియన్లు సహా వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. మరో 4,500 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటళ్లు అంటే కేవలం జీవోలు ఇచ్చుడు కాదు అని.. అవసరమైన భవనాలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, డయాగ్నస్టిక్, డ్రగ్స్ వంటి సౌకర్యాలు అన్నీ ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ పలు సందర్భాల్లో చెప్పారు. నిరంతర పర్యవేక్షణ, వరస రివ్యూలు, కోర్టు కేసులపై సమీక్షిస్తూ వాటిని క్లియర్ చేయించడంతో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేయనన్ని పోస్టులను ఈ రెండేళ్లలో ఆరోగ్య శాఖలో భర్తీ చేయడం గమనార్హం. సపోర్టింగ్ స్టాఫ్ మొదలు స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ వైద్య సేవలు బలోపేతం అయ్యాయి. గతంలో ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వడానికి అడ్డంకులు చెప్పిన నేషనల్ మెడికల్ కమిషన్ కొత్తగా 10 మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను సైతం మంజూరు చేసింది. ఈ ఏడాది మరో 250కి పైగా పీజీ సీట్ల కోసం మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఎనఎంసీకి దరఖాస్తు చేసింది. ఇవేగాÅ£, కొత్తగా ఐదు పీజీ సెంటర్లను సెకండరీ కేర్ హాస్పిటళ్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జిల్లాల్లోనే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే భర్తీ పూర్తయిన పోస్టుల వివరాలు :
నర్సింగ్ ఆఫీసర్లు: 9,278
ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్-2): 1,542
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (సీఏఎస్): 425
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్: 623
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-4): 334
ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు: 138
ఫిజియోథెరపిస్టులు: 48
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-3): 39
అసిస్టెంట్ ప్రొఫెసర్: 132
అసిస్టెంట్ ప్రొఫెసర్లు (వీచీజీ): 28
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు: 24
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (గ్రూప్-1): 20
డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు: 18
మొత్తం: 12,649
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



