– ప్రతి అభ్యర్థి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన బోర్డు
– 27వ తేదీ వరకు మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
– అభ్యంతరాల పరిశీలన అనంతరం సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక దశ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాసిన మొత్తం 40,423 మంది అభ్యర్థుల వివరాలను, వారు సాధించిన మార్కులతో బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. సీబీటీ, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సర్వీసు వెయిటేజీ మార్కులపై ఆగస్టులోనే ఒక దఫా అభ్యంతరాలను స్వీకరించి, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాపైనా అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తెలిపేందుకు మరోసారి అవకాశం కల్పించింది.
27 వరకు గడువు
అభ్యర్థులు నేటి (డిసెంబర్ 24) నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తామని, ఆ తర్వాత మెరిట్ ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని బోర్డు వెల్లడిరచింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేయనున్నారు.
జనవరిలో ఉద్యోగాల్లోకి..
ఇటీవలే 1260 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నియామక ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. ఈ 1260 మంది ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు, ఉద్యోగాలకు ఎంపికయ్యే 2,322 మంది నర్సింగ్ ఆఫీసర్లు కూడా జనవరిలోనే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏడు వేలకు పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తున్నది. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్ల్‌లో నర్సుల కొరత పూర్తిగా తీరిపోతుందని, అవసరానికి సరిపడ సిబ్బంది అందుబాటులో ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



