ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ బి.వినోదపై వచ్చిన సమాచారంపై కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా కళాశాలను సందర్శించిన సమయంలో ప్రిన్సిపాల్ విధులకు గైర్హాజరయ్యారు. కార్యాలయ గదికి తాళం వేసి ఉంది. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులతో విచారణ జరిపినప్పుడు ప్రిన్సిపాల్ ఈ నెల 29 నుండి తన విధులకు హాజరు కాలేదని, ఆసిఫాబాద్‌లో లేరని తెలిసిందని, ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి పొందలేదని తెలిపారు. డిసెంబర్-2025లో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు తరగతులు ప్రారంభించలేదని విద్యార్థులు, అధ్యాపకులు చెప్పారన్నారు. విద్యార్థులు అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉంటున్నారని, వారికి నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు గమనించామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులతో శుభ్రపరిచే పనులు, ప్రిన్సిపాల్ వ్యక్తిగత పనులు, వీధి కుక్కలు, పిల్లులకు ఆహారం పెట్టడం, వాటి పోషణ వంటి అంశాలపై ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థినుల వసతి గృహంలో సి.సి కెమెరా అమర్చారని, విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కారణంగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసినట్లు, క్రమశిక్షణా చర్యలు ముగిసే వరకు/క్రిమినల్ అభియోగాలకు సంబంధించిన అన్ని చర్యలను ముగించే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ కాలంలో చేసినట్లు వినోద జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని, ముందస్తు అనుమతి పొందకుండా ప్రధాన కార్యాలయం నుండి బయటకు వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




