– జపాన్, జర్మన్ భాషలు నేర్పేందుకు ‘ఎఫ్లూ’తో ఒప్పందం
– మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: కోవిడ్ కాలంలో కుటుంబ సభ్యులే పేషెంట్లకు దూరంగా ఉండగా తమ ప్రాణాలను పణంగా పెట్టి నర్సులే కుటుంబ సభ్యులై వారికి సేవలందించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. అలాంటి పవిత్రమైన వృత్తిలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ అభినందనలు అన్నారు. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ప్రభుత్వం నిబద్ధతో ముందుకెళ్తున్నదన్నారు. గతేడాది సుమారు ఏడు వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 2,322 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. దేశవిదేశాల్లో నర్సులకు ఉద్యోగావకాశాల కల్పనకూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జర్మన్, జపాన్ దేశాల్లో నర్సులకు చాలా డిమాండ్ ఉందని, మన నర్సుల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ భాషా సమస్యతో అక్కడ ఉద్యోగాలు పొందలేకపోతున్నారని చెప్పారు. అందుకే జర్మన్, జపాన్ వంటి విదేశీ భాషలు నేర్పించి వారికి అక్కడ ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈరోజు వైద్య శాఖ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఎఫ్‌ఎల్‌యూ)తో ఒప్పందం చేసుకుందని మంత్రి చెప్పారు. నర్సింగ్ స్టూడెంట్స్‌కు వర్చువల్‌గా, నేరుగా రెండేళ్లపాటు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తుందన్నారు. ఆయా దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. హాస్పిటళ్లు, హోమ్ కేర్ నర్సింగ్‌కు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పది ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని, మరో రెండు కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం నర్సింగ్ విద్యను చేరువ చేస్తున్నామని మంత్రి దామోదర చెప్పారు.
డిస్ట్రిక్ట్ డే కేర్ కేన్సర్ సెంటర్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ డే కేర్ కేన్సర్ సెంటర్లను సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి మంత్రి దామోదర వర్చువల్‌గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కేన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని, రాష్ట్రంలో ఏటా 55 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మరో ఐదేండ్ల తర్వాత ఏటా 65 వేలకుపైగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని, ఈ నేపథ్యంలో కేన్సర్ నివారణ, ఎర్లీ డయాగ్నసిస్, పేషెంట్లకు చికిత్స అందించే అంశాలపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రముఖ అంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు సలహాలు తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం ఎంఎన్‌జే, నిమ్స్‌లో కేన్సర్ పేషంట్లకు చికిత్స అందిస్తున్నామని, కానీ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఈ హాస్పిటళ్లపై లోడ్ పెరుగుతున్నదన్నారు. హైదరాబాద్‌కు వచ్చి చికిత్స తీసుకోవడం భారంగా మారిన నేపథ్యంలో ఎక్కడి వారికి అక్కడే చికిత్స అందించాలనే లక్ష్యంగా ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 34 సెంటర్లను ఈరోజు ప్రారంభించామని, ఈ సెంటర్లలో కేన్సర్ స్క్రీనింగ్, డయాగ్నసిస్, కీమో థెరపీ, పాలియేటివ్ కేర్ వంటి చికిత్సలన్నీ అందిస్తామని చెప్పారు. కీమో థెరపీ అవసరమైన పేషెంట్లు ఉదయం వచ్చి చికిత్స చేయించుకుని సాయంత్రానికల్లా ఇంటికెళ్లిపోవచ్చునన్నారు. అవసరమైనప్పుడు ఎంఎన్‌జే, నిమ్స్ నుంచి సీనియర్ డాక్టర్లు డే కేర్ సెంటర్లకు వచ్చి వైద్య సేవలందిస్తారని తెలిపారు. కేన్సర్ పేషెంట్లకు చివరి దశలో అవసరమైన పాలియేటివ్ కేర్ సేవలను సైతం అందజేసేలా ఈ సెంటర్లను తీర్చిదిద్దామని, 2030 కల్లా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజినల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



