– సర్క్యులర్ ఎకానమీ ద్వారా ఎందరికో మార్గదర్శకం
– వచ్చే ఏడాది ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్
– 2026-ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1ః నుమాయిష్ హైదరాబాద్ సిగ్నేచర్ గా నిలిచిందని ఎగ్జిబిషన్ సొసైటీ 2026 అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్ – 2026) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి సాధించాలనే తపనతో 1938లో ఉస్మానియా గ్రాడ్యుయేట్లు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, ఇపుడు ఈ నుమాయిష్ తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తోందని చెప్పారు. నుమాయిష్ అంటే హైదరాబాద్ ఎమోషనల్ అడ్రస్, ఒక సోషల్ ఎక్స్ పెరిమెంట్, ఒక సోషల్ స్టార్టప్, మైక్రో ఎకానమీ హబ్, మిర్రర్ ఆఫ్ డైవర్సిటీ, డెమోక్రటైజేషన్ ఆఫ్ కామర్స్ అని వివరించారు. సాధారణంగా ఏ ఎగ్జిబిషన్ అయినా పదేళ్లకో, ఇరవయ్యేళ్లకో తన ప్రాభవాన్ని కోల్పోతుందని, కానీ నుమాయిష్ ప్రతి సంవత్సరం తనను తాను పునఃసృష్టించుకుంటోందని చెప్పారు. ‘గంగా-జమునా తెహజీబ్’ ఇక్కడి ప్రతి స్టాల్‌లోనూ, ఇక్కడికొచ్చే ప్రతి విజిటర్ చిరునవ్వులోనూ సజీవంగా కనిపిస్తుందన్నారు. ఇక్కడ దొరికే కాశ్మీర్ పట్టు నుండి కన్యాకుమారి హస్తకళల వరకు భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. నేడు మనం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం.. కానీ నుమాయిష్ ఎప్పుడో లోకల్ టు గ్లోబల్ కి పునాది వేసిందని తెలిపారు. ఈ రోజు మనం అమెజాన్ లోనో, ఫ్లిప్‌కార్ట్ లోనో ఆర్డర్ ఇస్తే వస్తువు ఇంటికి వస్తుంది. కానీ అక్కడ మనిషి కనిపించడు. నుమాయిష్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వస్తువుతోపాటు ఆ వస్తువుని తయారు చేసిన మనిషి కనిపిస్తాడు.. వాళ్లతో నేరుగా మాట్లాడి వస్తువు కొంటాం. ఈ హ్యూమన్ కనెక్షన్ను ప్రపంచంలో మరే టెక్నాలజీ ఇవ్వలేదని తెలిపారు. వాణిజ్యం ద్వారా విద్య అందించే ఈ మోడల్ ప్రపంచంలో మరెక్కడా ఉండకపోవచ్చునన్నారు. నుమాయిస్ 19 విద్యాసంస్థల ద్వారా వేలాదిమంది విద్యార్థినుల భవిష్యత్తును తీర్చిదిద్దడం సామాన్యమైన విషయం కాదంటూ ఎగ్జిబిషన్ సొసైటీ ఎన్నో ఏళ్లుగా దీన్ని విజయవంతంగా చేసి చూపిస్తోందదన్నారు. నుమాయిష్ ద్వారా సమకూరిన ప్రతి రూపాయిని సమాజం కోసమే తిరిగి వెచ్చిస్తూ సర్క్యులర్ ఎకానమీని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తూ ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎగ్జిబిషన్ నిర్వహణలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నామన్నారు. సందర్శకులు, స్టాళ్ల నిర్వాహకులకు మరింత సమర్థవంతంగా సేవలు, సౌకర్యాలు, భద్రతను అందించేందుకు ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అందుబాటులోకి తేబోతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



