హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసు

~కోర్టు ఉత్తర్వులున్నా ఇంటి కూల్చివేతపై పిటిషన్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌ గ్రామంలోని 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశిస్తే ఎందుకు కూల్చేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఆదేశించింది. తన ఇంటి విషయంలో మున్సిపల్, హైడ్రా జోక్యం చేసుకుని కూల్చే ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ వడ్దే తార వేసిన వ్యాజ్యంపై గతంలోని ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేశారంటూ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌పై తదుపరి విచారణ ఆగస్టుS 22కు వాయిదా వేసింది. ఈమేరకు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం ఆదేశించారు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సున్నం చెరువు పరిధిలో ఉందని హైడ్రా చెబుతోంది. రెవెన్యూ అధికారుల సాయంతో సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోంది.. అని న్యాయవాది వాదించారు. దీనిపై హైకోర్టు, సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఆదేశించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పిటిషనర్‌ ఇంటిని కూల్చివేశారని, దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశామన్నారు. సున్నం చెరువుపై సర్వే పూర్తి చేసి హద్దులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ నిర్ణయించాలని, ఆ తర్వాత చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. గత నెల 30న పిటిషనర్‌ను అరెస్టు చేసి, ఇంటిని కూల్చివేశారని తెలిపారు. మాదాపూర్‌ పోలీసులు సుమారు 70 మంది తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి పిటిషనర్‌తోపాటు కుటుంబసభ్యులను ఇంటిని నుంచి బలవంతంగా బయటకు పంపి ఇంటిని కూల్చేశారని చెప్పారు. హైడ్రా కమిషనర్‌కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను ఈ ఆగస్టు 2కి వాయిదా వేసింది. ‎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *