– పరిశ్రమల భూములు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర
– బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
– పాలమూరుకు అన్యాయం చేస్తున్నారు
– రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శల దాడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రజా ఆస్తులైన 9, 300 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రకు పూనుకున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిలా కాక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో గురువారం చేరగా వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. హిల్ట్ పాలసీ పేరుతో రేవంత్ రెడ్డి మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిరదని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చవకగా భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్టుమెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆరోపించారు. ఐదారు వందల మంది కోసం రూ.5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని, ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేసిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్‌కు బీసీ సోదరులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప ఇప్పటివరకు రైతులకు చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయన్నారు. ప్రజల వెంట మనం ఉంటే వారే కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటారన్నారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలు వేసుకోబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైపల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





