రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం

– మహిళా సంఘాలకు రూ.5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
– రైతులు, పేదల కోసం రూ.1,21,874 కోట్లు ఖర్చు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మధిర, ప్రజాతంత్ర, జనవరి 19: మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దేందుకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాల సభ్యులకు రూ.5,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో సంపదను పెంచుతాం, పంచుతాం.. కానీ గద్దలు, డేగలు, రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం అని స్పష్టం చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మొదటి ఏడాది రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తాం అంటే హేళన చేశారు.. కానీ మేం లక్ష్యాన్ని మించి రూ.26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. పదేళ్లు పరిపాలించిన వారు ఇల్లు ఇవ్వలేదు.. మేం ఎన్నికలపుడు చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు రూ.22,500 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు, పేదల సంక్షేమం కోసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.లక్షా 21వేల 874 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల కోసం రూ.74,163 కోట్లు నేరుగా రైతులకు పంపిణీ చేస్తున్నాం.. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు చేపట్టి రూ.47,710 కోట్లు నేరుగా రైతులు, పేదల చేతికి ప్రజాప్రభుత్వం అందిస్తున్నదని వివరించారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని, ఇందుకుగాను ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.7వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చీరలు పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేందుకు కూడా పనికిరాలేదని, కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆడబిడ్డ ఇంటికి నాణ్యమైన చీరను బొట్టు పెట్టి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రవ్యాప్తంగా వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని భట్టి తెలిపారు.

జిల్లాలో అదనంగా 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు

గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే ఖమ్మం జిల్లాలో 2.79 లక్షల ఎకరాలకు సాగునీరందించి సస్యశ్యామలం చేశామని చెప్పారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖమ్మం జిల్లాలో 1.98 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. మున్నేరు- పాలేరు లింకు ద్వారా 1.38 లక్షల ఎకరాలకు, నెహ్రూ ఎత్తిపోతల కింద 33,025 ఎకరాలకు, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,500 ఎకరాలకు, మంచుకొండ ఎత్తిపోతల ద్వారా 2,412 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల మీదుగా పారుతున్న నదులు, ఏరుల నీరు వృధాగా పోకుండా అడ్డుకట్టలు వేసి పొలాలకు నీళ్లు పారిస్తున్నామన్నారు. ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు, మధిర బోనకల్లు మధ్య వైరా నదిపై, చింతకాని ముదిగొండ మధ్య మున్నేరు నదిపై ఆనకట్టలు నిర్మించామని భట్టి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

#

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *