– బీసీలపై కాంగ్రెది కపట ప్రేమ
– కేంద్ర మంత్రి బండి సంజయ్
దిల్లీ, ఆగస్టు 6: యాభయ్యేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీలను పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా.. సీఎంను చేసిన లెక్కలు ఉన్నాయా.. ఉంటే చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందంటూ ఇది కామారెడ్డి డిక్లరేషన్ కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనేనని వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ బీసీలకు 5 శాతం పెంచి ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ముసుగులో ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే తమ పార్టీ మద్దతిస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. యాభయ్యేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీని ప్రధానిగా చేశారా అని సంజయ్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా, ప్రస్తుత తెలంగాణ కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలకు ఎన్ని ఇచ్చారో చర్చిద్దామా అని సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఎన్ని సీట్లిచ్చారో సమాధానమివ్వగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి తమకు నీతులు చెప్పడమా అని ఆయన ఎద్దేవా చేశారు. బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీదేనన్నారు. 27మంది బీసీ కేంద్ర మంత్రులను, అనేక రాష్ట్రాలకు బీసీ సీఎంలను నియమించిన ఘనత బీజేపీదేనని సంజయ్ తెలిపారు. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుంచి కాంగ్రెస్ నేతలు తప్పుకోవాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. యూపీ, బెంగాల్, బిహార్ తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగవడం తథ్యమని జోస్యం చెప్పారు. ఈరోజు ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే దిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోందే తప్ప బీసీల కోసం కానేకాదని స్పష్టం చేశారు. మైనార్టీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్‌ను అమలు చేయాలనుకుంటోందని, అందుకే కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరవైందని బండి సంజయ్ అన్నారు.


