– నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
– కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఈ కేసు విచారణకు రాగా నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు.కేసు వివరాల్లోకి వెళితే కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ దశకు చేరుకుంది. గురువారం విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా నిందితురాలైన సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సహకరించకుండా నిరంతరం గైర్హాజరవుతున్న తీరును సీరియస్‌గా తీసుకున్న న్యాయమూర్తి, ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సాధారణ వారెంట్ లాగా ఇందులో బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉండదు. ఈ వారెంట్ అమలు చేసి నిందితురాలిని హాజరుపరిచే బాధ్యతను పోలీసులకు అప్పగించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



