రేవంత్ అమెరికా వెళ్తే శబ్ద కాలుష్యం తగ్గింది

– అక్కాచెల్లెళ్లకు కాంగ్రెస్ సర్కార్ రూ.60 వేలు బాకీ
– బీజేపీకి 8మంది ఎంపీలున్నా బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా
– బీఆ ర్‌ఎస్ నేత హరీష్‌రావు

నర్సాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చింది.. అధికారంలోకి వచ్చి 700 రోజులు దాటినా ఏ ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు కాలేదని బీఆ ర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు విమర్శించారు. నర్సాపూర్ లో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్ మహిళలకు ఇప్పటికే రూ.2500 ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని, కానీ ఇప్పటివరకు ఒక్కో మహిళకు రూ.2500 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60వేలు బాకీ పడిందని హరీష్‌రావు తెలిపారు. కేసీఆర్ ఇచ్చినవన్నీ ఈ ప్రభుత్వం బంద్ పెట్టింని తెలిపారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్షా 116 ఇస్తే రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా ఇస్తానని ఆశపెట్టి ఉన్న రూ.లక్ష కూడా ఇవ్వకుండా రెండేళ్లుగా చెక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నాడని విమర్శించారు. ప్రశ్నిస్తే కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి 14 రోజులు అమెరికా పోతే శబ్ద కాలుష్యం తగ్గింది.. రాగానే మళ్ళీ మొదలైందని ఎద్దేవా చేశారు. అవ్వతాతలకు పెన్షన్ అడిగితే లాగుల తొండలు తీసి పెడత అంటాడు.. మహిళలకు రూ.2500 అడిగితే మెడలో పేగులు వేసుకుంటా అంటాడు.. తులం బంగారం ఏది అని అడిగితే గుడ్లు పీకి గోలీలు ఆడుతా అంటాడు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బు కట్టలు నర్సాపూర్‌కు పంపిస్తున్నాడట.. ఓటుకు రూ.5000 పంచాలని చూస్తున్నాడని ఆరోపించారు. ప్రజలారా రేవంత్ రెడ్డి ఇచ్చే ఆ డబ్బు తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి అని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే ప్రభుత్వం మెడలు వంచి నెలనెలా రావాల్సిన రూ.2500 సాధించుకోగలమన్నారు. కేసీఆర్ రాకముందు నర్సాపూర్ ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లుంది.. నర్సాపూర్‌ను మున్సిపాలిటీ చేసింది, ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, బస్ డిపో కట్టింది, గల్లీగల్లీకి రోడ్లు వేసింది కేసీఆర్ కాదా అని అడిగారు. మైనారిటీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్, షాదీ ముబారక్, ఇమామ్ మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చింది బీఆ ర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఎనిమిదిమంది ఎంపీలు, ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మనకు మొండిచేయి చూపి గుజరాత్, ఏపీలకు నిధులు ఇస్తున్నదని ఆరోపించారు. మన సిమెంట్ ఫ్యాక్టరీని తెరవరు.. మూసీకి నిధులు ఇవ్వరు.. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీకి మనమెందుకు ఓటు వేయాలి అని నిలదీశారు. ఈ కౌన్సిలర్లు అయిదేళ్లు ఉంటారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకా రెండేళ్లే. మళ్ళీ వచ్చేది బీఆరఎస్ ప్రభుత్వమే. అప్పుడు కేసీఆర్ సీఎం.. నేనుంటాను. నర్సాపూర్ అభివృద్ధిని కొనసాగిస్తాం.. అందుకే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆరఎస్ అభ్యర్థులను గెలిపించండి అని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *