– హామీలు ఎగ్గొట్టి రూ.100 కోట్లతో ఫుట్‌బాల్ ఆడతారా?
– ఓడతామనే భయంతోే సహకార ఎన్నికలు జరపడం లేదు
– రేవంత్ రెడ్డి రేసింగ్ సీఎం కాదు.. ఫ్లయింగ్ సీఎం
– మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయని, కారు జోరు.. కాంగ్రెస్ బేజారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90% గెలిస్తే మిగతావి ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయని, కానీ బీఆర్ఎస్ 40 శాతం అంటే నాలుగు వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా, డబ్బులు పంచినా, గుండాయిజం చేసినా ఎదిరించి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో శనివారం జరిగిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ సంగారెడ్డిలో 34 సర్పంచ్ స్థానాలు ఉంటే అందులో 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని, బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచులను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని, రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 శాతంలోపే సర్పంచులు గెలిస్తే 66% గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ రావాలని ఎదురు చూస్తున్నారన్నారు. పంట పండాలంటే నీళ్లు, కరెంటు, ఎరువులు కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అప్పులు కావాలి.. మ్యాపులు కావాలి అంటున్నాడు. ఎరువు బస్తాలు కావాలంటే యాప్‌లో కొనండి అంటున్నాడు. రేవంత్ రెడ్డీ్డ.. ఎప్పుడైనా వ్యవసాయం చేశావా.. రైతుల కష్టం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎరువుల కోసం గంటలతరబడి లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిరదని విమర్శించారు. పైగా ఇప్పుడు యాప్‌లో బుక్ చేసుకోవాలంటున్నాడు. యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టిండు. రుణ మాఫీ సగంమందికి కూడా కాలేదన్నారు. మున్సిపాలిటీల టైం అయిపోయినా ఎన్నికలు పెట్టట్లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు అని హరీష్ నిలదీశారు. రేవంత్‌కి ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే సహకార ఎన్నికలు పెట్టమంటే కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుందామని జీవో ఇచ్చిండు. రేవంత్ రెడ్డీ నీకు ధైర్యం ఉంటే, నువ్వు రైతులకు మేలు చేసెటోడివే అయితే సహకార ఎన్నికలు పెట్టు.. ఎందుకు నామినేట్ చేస్తున్నావ్ అని అడిగారు.
సర్పంచ్‌కు మాత్రమే చెక్‌పవర్
సర్పంచ్‌లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఢల్లీి నుంచి గల్లీకే వస్తాయి. రేవంత్ రెడ్డి, మంత్రులు ఆపలేరు. ఎమ్మెల్యే ఆపలేడు. డైరెక్ట్ సర్పంచుల అకౌంట్లో పడతాయి. ఎమ్మెల్యేకి, మంత్రికి ఆఖరుకు ముఖ్యమంత్రికి కూడా చెక్ పవర్ లేదు. కానీ సర్పంచ్‌కు ఉంది.. ధైర్యంగా పనిచేయండి అని హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఇంకో రెండేళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. మీరు ఐదేళ్ల కోసం సర్పంచ్‌గా గెలిచారు. మీ పదవీ కాలంలో మల్ల మూడేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ పనులు చేయించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. నిన్న దండం పెట్టి ఓటు అడిగి ఈరోజు గెలవంగానే మారిపోకూడదని సర్పంచ్‌లకు హితబోధ చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన మనవడు సోకు తీర్చుకోవడానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్‌బాల్ ఆడిరడు. సింగరేణి కార్మికుల రూ.10 కోట్ల డబ్బును ఫుట్‌బాల్ మ్యాచ్‌కు పెట్టిండు. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 కోట్లతో ఫుట్‌బాల్ గ్రౌండ్ కట్టుకున్నాడు. నీ సొంత డబ్బుతో కట్టుకో రేవంత్ రెడ్డీ అని హితవు పలికారు. సింగరేణి సీఎస్సార్ డబ్బులతో కేసీఆర్ స్కూళ్లు కట్టించిండు.. రోడ్లు ఏయించిండు. మెడికల్ కాలేజీలు పెట్టించిండు.. కొత్త జిల్లాలు చేయాలి.. కొత్త మెడికల్ కాలేజీ చేయాలి.. మండల కేంద్రానికి రోడ్లు వేయాలని కేసీఆర్ పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఏమో అందాల పోటీలు పెట్టాలి.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాలి.. గ్లోబల్ సమ్మిట్ పేరుతో సోకులు చేయాలి.. దిల్లీకి-హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టాలి అని అనుకున్నాడు. అందాల పోటీలతో, ఫుట్‌బాల్ పోటీలతో మనకేమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. రూ.4000 పెన్షన్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఉన్న రూ.2000 కూడా సక్కగా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి రేసింగ్ సీఎం కాదు.. ఫ్లయింగ్ సీఎం అని ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





