-మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మనోవేదనకు గురై ఆ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమన్నారు. మరోవైపు పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు రాక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు అని ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి హామీ పథకం ఏపీవోలు, పారిశుధ్య కార్మికుల పెండిరగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నానన్నారు.





