– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా జూబ్లీహిల్స్‌కి ఒరిగిందేమీ లేదని మంత్రి సీతక్క విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ అందుబాటులో లేరంటూ పిలిస్తే పలికే నవీన్ యాదవ్‌ను ఈ ఉప ఎన్నికలో గెలిపించండి అని బోరబండ సైట్ 3లో జరిగిన ప్రచార సభలో ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీని గెలిపించుకుంటే మీ సమస్యలు తీరుతాయి.. అభివృద్ధి జరుగుతుంది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాలేదు ప్రజలకి ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేస్తున్నాం.. గతంలో కరెంట్ బిల్లులు కట్టకపోతే పేదల ఇంటి కనెక్షన్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్ చేసింది.. కానీ తమ ప్రభుత్వం పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నదని తెలిపారు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇస్తున్నాం.. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాలో రూ.లక్ష జమ చేస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నామని, వారి వడ్డీలను కూడా బ్యాంకులకు తామే చెల్లిస్తున్నామని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలకు దక్కాల్సిన రూ.3000 కోట్ల వడ్డీ పైసలను చెల్లించలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. గత ప్రభుత్వం ఇక్కడి ప్రజలను నిర్లక్ష్యం చేసినందున ఎన్నో సమస్యలు అలాగే ఉండిపోయాయి.. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న ఆడవారిని అవమానపరిచిన కేటీఆర్‌కు మహిళలు ఓట్లు వేయొద్దు అన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్ మోసం చేశారు.. మాగంటి తల్లి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో అర్థమవుతుంది అన్నారు. ఓటమి తప్పదని తెలిసి బీఆర్‌ఎస్ నాయకులు అవస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నిక పూర్తయిన వెంటనే ఈ నియోజకవర్గ పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి క్షనివాస్‌రెడ్డి చెప్పారు. వడ్డెరలకు నగరంలోనే స్థలం కేటాయిస్తామన్నారు. జూబ్లీహిల్స్ బోరబండలోని వడ్డెర ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అజారుద్దీన్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ మైనారిటీ నాయకుడు చేరిక
బోరబండ సైట్ 3లో జరిగిన కాంగ్రెస్ సభలో మంత్రి సీతక్క సమక్షంలో బీఆర్‌ఎస్ మైనారిటీ నాయకుడు, కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన జమీర్ బాషా కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. బోరబండ వీధులు కిక్కిరిసిపోయాయి. చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకులు రోహిన్ రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.





