దేశంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కొరత లేదు

– ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు
– దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా
– బ్లాక్‌ ‌మార్కెటింగ్‌పై దాడులు కొనసాగిస్తున్నాం
– పైప్‌ ‌గ్యాస్‌ అం‌దుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానికే ప్రాధాన్యం
– ఆందోళనల నేపథ్యంలో మరోమారు కేంద్రం ప్రకటన

న్యూదిల్లీ, మార్చి 25: పైపులతో నేచురల్‌ ‌గ్యాస్‌ ‌కు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, పెట్రోల్‌, ‌డీజిల్‌కు దేశంలో ఎలాంటి కొరత లేదని, ఇంధనం ధరల్లో కూడా మార్పు లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. వదంతులు నమ్మవద్దని కోరింది. గృహావసరాల కోసం వంద శాతం పీఎన్‌జీ సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు. ఈమేరకు నోటీఫికేషన్‌ ఇచ్చామని, నిర్దిష్ట కాలపరిమితిలోపు దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్‌ ‌గ్యాస్‌ ‌మౌలిక వసతుల అభివృద్ధి జరగనుందని చెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఎల్పీజీ, ఇంధనం కొరతపై ఆందోళనలను ప్రస్తావిస్తూ ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ప్యానిక్‌ ‌బైయింగ్‌కు పాల్పడవద్దని కోరారు. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఏటా 26 కోట్ల టన్నుల రిఫైనరీ సామర్థ్యం మనకు ఉందని చెప్పారు. రెండు రోజులుగా రిటైల్‌ ఔట్‌లెట్‌లు, పెట్రోల్‌ ‌బంకుల వద్ద పెద్దఎత్తున జనం క్యూలు కడుతుండటం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆందోళన అవసరం లేదని, దేశంలో తగినన్ని పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌నిల్వలు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలు కూడా పెరగబోవడం లేదని వివరించారు. వలస కార్మికులకు ప్రాధాన్యతా క్రమంలో 5 కిలోల సిలెండర్లు అందిస్తామని సుజాతా శర్మ తెలిపారు. 26 రాష్ట్రాల‌కు 22,000 టన్నుల ఎల్పీజీ కేటాయించామన్నారు. మంగళవారంనాడు 30,000 ఐదు కేజీల సిలెండర్లు ఇచ్చామని చెప్పారు.

బ్లాక్‌మార్కెటింగ్‌, అ‌క్రమ నిల్వలకు కళ్ళెం వేసేందుకు 2,700 దాడులు జరిపామని, 2,000 సిలెండర్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గ్యాస్‌ ‌రీఫిల్‌ ‌బుకింగ్‌ ‌గడువు పెంపుపై వస్తున్న వార్తలు నిజం కాదనీ, గ్యాస్‌ ‌బుకింగ్‌ ‌సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవనీ సుజాత శర్మ వివరించారు. కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్‌ ‌బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎప్పటిలాగానే కొనసాగుతుందని సుజాత శర్మ స్పష్టం చేశారు. ఇదిలావుంటే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించడం సహా గ్యాస్‌ ‌పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ ‌న్యాచురల్‌ ‌గ్యాస్‌(‌పీఎన్‌జీ) సరఫరా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెంటనే దానికి మారాలని ఆయా వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో లిక్విడ్‌ ‌పెట్రోలియం గ్యాస్‌(ఎల్‌పీజీ) సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. దేశంలో పీఎన్‌జీని ప్రోత్సహించే దిశగా ముందడుగు వేస్తున్న కేంద్రం.. ఈ మేరకు 3 నెలల గడువు నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది. పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ఎల్‌పీజీ సిలిండర్లను మౌలిక సదుపాయాలు లేని ఏరియాలకు మళ్లించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. పీఎన్‌జీకి మారడం వల్ల రీఫిల్‌ ‌బుక్‌చేసే అవసరముండదు. దీంతోపాటు నిరంతర గ్యాస్‌ ‌సరఫరా అందుబాటులో ఉంటుంది. అయితే.. పీఎన్‌జీ సరఫరాలో సాంకేతిక సమస్యలు, ఇంటికి పైప్‌లైన్‌ ‌కనెక్షన్‌ ఇవ్వడం అసాధ్యమైన సందర్భంలో మాత్రమే ఎల్‌పీజీ సరఫరా కొనసాగుతుంది.కానీ.. దానికి పీఎన్‌జీ గ్యాస్‌ ‌కంపెనీ నుంచి నిరభ్యంతర పత్రంతప్పనిసరి. మేరకు పీఎన్‌జీ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు పలు చర్యలు చేపట్టింది కేంద్రం. పైప్డ్ ‌గ్యాస్‌ ‌లైన్‌కు నిర్ణీత గడువులోగా అధికారులు అనుమతులు మంజూరు చేయాలి. నిర్దేశిరచిన ఫీజుకంటే ఎక్కువ వసూలు చేయకూడదు. హౌసింగ్‌ ‌సొసైటీలు లేదా భూయజమానులు కూడా పైపులైన్‌ ‌సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదు. అలాంటి సందర్భాలేమైనా తలెత్తితే ఆ ప్రాంతానికి ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేయడం సహా సంబంధిత వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. వీటి అమలును పర్యవేక్షించడం సహా సమ్మతిని నిర్దారించేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డ్ ‌నోడల్‌ అథారిటీకి బాధ్యతలు అప్పగించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *