పెట్రోల్‌, ‌డీజిల్‌లకు కొరత లేదు

– బాటిళ్లలో వాటిని సరఫరా చేస్తే కఠిన చర్యలు
– తమిళనాడు ఘటనలో డీలర్‌షిప్‌ ‌రద్దు చేసిన కేంద్రం
– పెట్రోలియం శాఖ కీలక ఆదేశాలు జారీ

న్యూదిల్లీ, మార్చి 14: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందు జాగ్రత్తగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ను.. సీసాలు, డబ్బాలు లాంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీచేసింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్‌ ‌బంకుల్లో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇటీవల తమిళనాడులోని ఒక రిటైల్‌ అవుట్‌లెట్‌లో వినియోగదారుడికి లూజ్‌ ‌కంటైనర్‌లో పెట్రోల్‌ ‌పోసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది భద్రతా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, అందుకే ఆ పెట్రోల్‌ ‌బంక్‌ ‌లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్‌ ‌చేసి, సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రిటైల్‌ అవుట్‌లెట్‌లు, డీలర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెట్రోల్‌ ‌వంటి మండే స్వభావం ఉన్న ఇంధనాన్ని అసురక్షిత పద్ధతుల్లో నిల్వ చేయడంవల్ల తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్‌, ‌డీజిల్‌కు కొరత లేదని భరోసా ఇచ్చింది. కంగారు పడి కొనుగోళ్లకు దిగవద్దని ప్రజలకు సూచించింది. సాధారణ కంటెయినర్‌లలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇక గృహవినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌ల విషయంలో నెలకొన్న భయాందోళనలపై ఇటీవల మార్కెటింగ్‌ ఆయిల్‌ ‌రిఫైనైరీ విభాగం జాయింట్‌ ‌సెక్రెటరీ కూడా స్పందించారు. ఎల్‌పీజీ డెలివరీల్లో ఎలాంటి ఆటంకాలు లేవని అన్నారు. గ్యాస్‌ ఉత్పత్తిని భారతీయ రిఫైనైరీలు 30 శాతం మేర పెంచాయని అన్నారు. గృహ వినియోగదారులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్టు తెలిపారు. ఇక కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్‌లకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేసింది. కీలక రంగాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా జరిగేలా మార్గదర్శకాల రూపకల్పన, అమలు బాధ్యతలను రాష్ట్రాలకు బదిలీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *