– ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అధ్యాపకుల కష్టాలు
– పార్ట్ టైమ్ ఉద్యోగంగా భావించమంటున్న యాజమాన్యాలు
– తక్షణం జీతాల బకాయిలు చెల్లించాలి
– ఉద్యోగుల డిమాండ్
హైదరాబాద్ ,ప్రజాతంత్ర, మార్చి 18: ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, ఈస్టర్ వంటి ప్రధాన పండుగల వేళ అనేక ప్రైవేట్ టెక్నికల్ కళాశాలలలో పనిచేస్తున్న అధ్యాపకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత నాలుగు నుంచి ఐదు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అధ్యాపకులు జీతాల చెల్లింపులో అసమానతలు ఉన్నాయని పేర్కొన్నారు. కొన్నిచోట్ల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులకు మొదటి సంవత్సరం బోధించే వారికి మాత్రమే జీతాలు చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత ఆగస్టు 2025 జీతాన్ని ఫిబ్రవరి 2026 లో చెల్లించగా ఇంకా ఐదు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని చెప్పారు. పదేళ్లకుపైగా అనుభవం కలిగిన డాక్టర్ గోపాలచారి, 16 సంవత్సరాలుగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ అరుణ వంటి అధ్యాపకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు ఐదు నెలలుగా జీతాలు రాలేదు. కొందరికి శిక్షణలు, కన్సల్టెన్సీల ద్వారా కొంత ఆదాయం ఉన్నా, చాలామంది ఉపాధ్యాయులు పూర్తిగా జీతాలపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఈ కారణంగా ఉపాధ్యాయులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈఎంఐలు చెల్లించలేకపోవడం, గృహ ఖర్చులు నిర్వహించలేకపోవడం, పరీక్షల ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. క్రెడిట్ స్కోర్ దెబ్బతినడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదని వారు వాపోతున్నారు. పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వడం, సకాలంలో పీజులు చెల్లించడం జరిగే పని కాదు, పండుగలను సైతం సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి ఉంది అని ఒక అధ్యాపకుడు పేర్కొన్నారు. ఇంతటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కళాశాలలు మాత్రం అధ్యాపకులపై కఠినమైన పనిభారం కొనసాగిస్తున్నాయి. సమయపాలన, అక్రెడిటేషన్ పనులు, ఇతర అదనపు బాధ్యతలు అన్నీ నిర్వర్తించాల్సిందే. కానీ జీతాల గురించి అడిగితే ఇది పార్ట్‌టైమ్ ఉద్యోగంగా భావించండి అని యాజమాన్యం స్పందిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కళాశాలలకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ జీతాలు చెల్లించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థుల ప్రవేశాలు, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అధ్యాపకులకు జీతాలు చెల్లించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి విద్య నాణ్యతపై కూడా ప్రభావం చూపుతోంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు. పరిశోధన కార్యకలాపాలు తగ్గిపోయాయి. అయిదేళ్లుగా ముఖ్యమైన అకడమిక్ కార్యక్రమాలు జరగడం లేదని ఆరోపణలున్నాయి. ఏఐసిటిఈ, యూజీసీ, డిఎస్టి వంటి సంస్థలకు ప్రతిపాదనలు ఇవ్వాలన్న ఉత్సాహం కూడా తగ్గిపోయిందని తెలిపారు. ఐఈఈఈ, సిఎస్ఐ వంటి ప్రొఫెషనల్ సంస్థల కోఆర్డినేటర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కూడా చెల్లించలేదని చెప్పారు. కొన్ని సందర్భాల్లో వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థుల నుంచే నిధులు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రణ సంస్థలు వెంటనే జోక్యం చేసుకుని జీతాల బకాయిలను విడుదల చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




