– బరితెగించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్
– నిబంధనలు తుంగలో తొక్కి స్టోన్ క్రషర్ల నిర్వహణ
– సిట్టింగ్ జడ్జితో విచారణ.. లేదా హౌస్ కమిటీ వేయండి
– పొంగులేటి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి
– మైనింగ్ పై చర్చలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: మైనింగ్ శాఖ పద్దులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌ను ఆధారాలతో, అధికారుల నోటీసులతో సభ ముందుంచారు. మైనింగ్ డిపార్టుమెంట్‌లో అధికారులు, ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా పని చేస్తే ఖజానాకు అంత డబ్బు వస్తుంది.. కానీ ఇవాళ మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణం జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది అని ఆయన ఆరోపించారు. తాను ఏది చెప్పినా పక్కా ఆధారాలతో చెబుతున్నాను.. రాష్ట్ర ఆదాయానికి తూట్లు పడొద్దు అన్నదే తమ తపన అని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున, నగరాన్ని ఆనుకునే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి వచ్చిన మనందరికీ రాష్ట్ర వనరులను కాపాడే బాధ్యత ఉందన్నారు. జీవో 111 ఉల్లంఘిస్తూ రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ దందాకు పాల్పడుతోందని, రూల్స్ లేవు., పర్మిషన్స్ లేవు.. దర్జాగా దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలో (సర్వే నెంబర్ 62, 63) ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడనప్పటికీ అక్కడ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లపై యథేచ్ఛగా నడుపుతోందని తెలిపారు. ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 26 (స్టోన్ క్రషర్ రూల్స్ 2026) ప్రకారం క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ (ఎండీఎల్) ఉండాలి.. పరిశ్రమల శాఖ అనుమతి తీసుకోవాలి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫఈ, సీఎఫ్‌వో సర్టిఫికెట్లు తీసుకోవాలి, కానీ వీటిలో ఏ ఒక్కటీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పాటించలేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే పైన పేర్కొన్న పర్మిషన్లన్నీ ఉండాలి.. అవి లేవు కాబట్టే దొంగచాటుగా జనరేటర్లతో క్రషింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీని క్రోనాలజీ ప్రకారం సభ ముందు పెడుతున్నానని హరీష్‌రావు అన్నారు. 21 మే 2025 నాడు మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్‌పై తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారు. 2026 ఫిబ్రవరి 13న డిమాండ్ నోటీసు ఇచ్చినా ఆ కంపెనీ పట్టించుకోలే<ÁT. మార్చి 4న మళ్లీ తనిఖీ చేయగా ఈసారి 11,200 మీ.ల ముడి సరకు దొరకగా 13న మరో షోకాజ్ నోటీసు (నం.788) ఇచ్చారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా జనరేటర్‌పై స్టోన్ క్రషర్ నడుపుతున్నారు.. కాలుష్యానికి పాల్పడుతున్నారు అని మైనింగ్ అధికారులే స్వయంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఈనెల 5న లేఖ రాశారని, మైనింగ్ చట్టం ప్రకారం ఎండీఎల్ లైసెన్స్ లేకుండా క్వారీ చేస్తే మొదటిసారి రూ.10వేలు, రెండోసారి పట్టుబడితే రూ.25 వేల జరిమానాతోపాటు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించాలని సభ దృష్టికి తెచ్చారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడినా ఈ ప్రభుత్వం మౌనంగా ఎందుకుంటోంది.. ఆ కంపెనీపై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. మీరు తీసుకున్న చర్యలు ఏంటో సమాధానం చెప్పాలన్నారు. పటాన్‌చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడి స్టోన్ క్రషర్‌లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. ప్రతిపక్షానికి ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయం ఉంటుందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏమో మూసీలో కాలుష్యం జరగవద్దు అంటారు. కానీ ఇక్కడ మైనింగ్ అధికారులే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వల్ల మూసీ నది కాలుష్యానికి, గండిపేట్, హిమాయత్ సాగర్‌లో కాలుష్యానికి కారణం అవుతున్నదని లిఖితపూర్వకంగా తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఏం సంబంధం అని మైనింగ్ శాఖ మంత్రి అడుగుతున్నారని, గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై తాము ట్విట్టర్‌లో పెడితే మంత్రి పొంగులేటి ప్రెస్‌మీట్ పెట్టి నాపై మొరిగే కుక్కలను ఎలా కట్టేయాలో మాకు బాగా తెలుసు అని మాట్లాడారు. సంబంధం లేకపోతే మీరెందుకు భుజాలు తడుముకున్నారు అంటూ మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని హరీష్‌రావు సవాల్ చేశారు. మీరు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ వేశారు.. విద్యుత్ కమిషన్ వేశారు.. మీ చేతుల్లో పవర్ ఉంది.. ఎంక్వయిరీ చేసుకోండి.. ఉమ్మడి ఏపీలో ఓబులాపురం మైన్స్‌పై ఆరోపణలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హౌస్ కమిటీ వేసి ఆరోపణలు చేసిన నాగం జనార్దన్ రెడ్డినే కమిటీకి చైర్మన్‌గా వేశారు. ఇప్పుడు తాను ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా.. మీకు నిజాయతీ ఉంటే ఈ కుంభకోణంతో మీకు సంబంధం లేకపోతే ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయండి.. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిపై తమకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు.. ఆయన గతంలో మాతో కలిసి పనిచేశారు.. కానీ ఒక తప్పు జరిగినప్పుడు.. ఆ తప్పును ఆధారాలతో బయటకు తీయడం, రాష్ట్ర ఖజానాను కాపాడటం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని హరీష్‌రావు అన్నారు.
ఒకరిని టార్గెట్ చేస్తూ విమర్శించడం పద్ధతి కాదు :మంత్రి దుద్దిళ్ల
చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పాలని ప్రతి సభ్యుడు అనుకుంటారు. కానీ ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వకుండా హరీష్ రావు ఒక్కరే ఇతరుల సమయాన్ని తీసుకోవడం సరికాదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇది సభా సంప్రదాయం కాదు. విచారణకు సిద్ధం అని ప్రభుత్వం తరఫున మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటికే హౌజ్‌లో అనౌన్స్ చేశారు. అయినా హౌజ్ కమిటీ వేయాలంటూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సరికాదు. హౌజ్ కమిటీ వేయడం సాధ్యం కాదని తెలిసినా కావాలనే బీఆర్‌ఎస్ సభ్యులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి ప్రభుత్వ హయాంలో ఈసీ లేకుండానే ఎన్నో కంపెనీలు నడిచాయి. అప్పుడేమో పట్టించుకోలేదు. ఇప్పుడేమో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఒకరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సభా సంప్రదాయం కాదని ఆయన అన్నారు. హరీష్ రావు దగ్గర సబ్జెక్టు ఉండొచ్చు.. అలా అని అభూత కల్పనలతో అందరినీ తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. వెంటనే హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మైనింగ్ డిపార్టుమెంట్ బాగా పనిచేసినట్టు ఇప్పుడు చేయడం లేదంటూ తప్పుడు ప్రచారం సరికాదన్నారు. మీరు సలహాలు ఇస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మైనింగ్ డిపార్టుమెంట్‌లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు.
సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం 
అక్రమ మైనింగ్‌పై శాసనసభ వేదికగా సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల ఇసుక మాఫియాపై సంతోష్‌రావు తండ్రి రవీందర్‌రావుపై విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గంగుల కమలాకర్‌కు సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్‌పై విచారణకు సిద్ధం.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్‌పై విచారణకు సిద్ధం.. రాఘవ కన్‌స్ట్రక్షన్‌తోపాటు వీటన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నాం.. విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తాం.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలు జరిగినా తమ ప్రభుత్వం ఉపేక్షించదు.. అందులో భాగంగానే రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోమన్నది.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ నుంచి మైనింగ్ శాఖ ఫైన్ కట్టించుకుంది.. ఇది వాళ్లు కనిపెట్టి ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్యలు కాదు.. తమ ప్రభుత్వమే వివరాలు తీసుకుని చర్యలు తీసుకుంది అని స్పష్టం చేశారు. మంత్రిపై బురద చల్లాలని, వాళ్ల పైరవీలకు సహకరించడం లేదని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.. వాళ్ల బ్లాక్ మెయిల్‌కు ప్రభుత్వం లొంగదు.. సీబీసీఐడీ విచారణతో నిజాలు నిగ్గు తేలుస్తాం అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
———————————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





