– రాజ్యసభ ఓ ఓపెన్ యూనివర్సిటీ
– సీనియర్ సభ్యుల సేవలు ఇతరులకు ఆదర్శం
– రిటైర్ అవుతున్న సభ్యుల వీడ్కోలులో ప్రధాని మోదీ
– మాతో ప్రేమాయణం.. మోదీతో అనుబంధం
– దేవెగౌడపై ఖర్గే చతురోక్తులు
న్యూదిల్లీ, మార్చి 18: పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవ ముగిసినట్టు కాదని రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులనుద్దేశించి ప్రధానమంత్రి మోదీ అన్నారు. రాజ్యసభ మేధావుల వేదిక అని, ఇక్కడ లభించే జ్ఞానానికి విలువ కట్టలేమని అన్నారు. హెచ్‌డీ దేవెగౌడ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్ వంటి దిగ్గజ నేతల సహకారాన్ని మరువలేమని, సగానికి పైగా తమ జీవితాన్ని పార్లమెంటుకే అంకితం చేశారని ప్రశంసించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంటుందని సూచించారు.రాజకీయాల్లో ఫుల్‌స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో 59 మంది సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తన సందేశంతో ఆ సభ్యులకు వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్లమెంట్ ఓ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదన్నారు. రిటైర్ అయి వెళ్లిపోతున్న ఎంపీలు దేశం కోసం తమ విధులను నిర్వర్తిస్తూ ఉండాలని ఆకాంక్షించారు. ఫేర్‌వెల్ లాంటి సందర్భాల్లో పార్టీల మధ్య ఉన్న విబేధాలు సమసిపోతాయన్నారు. మనలో ఒకేరకమైన భావోద్వేగం వస్తుందని, మనతో ఇన్నాళ్లు పనిచేసిన తోటి సభ్యులు తమ జీవితంలో మరో మార్గాన్ని అన్వేషించబోతున్నారని గ్రహిస్తామని ప్రధాని పేర్కొన్నారు. అయితే మళ్లీ రాజ్యసభకు రాలేని వారిని ఉద్దేశిస్తూ రాజకీయాల్లో ఫుల్ స్టాప్ అంటూ ఉండదని, మీకోసం భవిష్యత్తు ఎదురుచూస్తోందని, ఈ దేశ నిర్మాణం కోసం అనుభవాలు చాలా అవసరం ఉంటుందని ప్రధాని తెలిపారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చాలా మృదుస్వభావి, నిత్యం కార్యాచరణలో నిమగ్నమై ఉంటారని అన్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే గురించి మాట్లాడుతూ ఆయన నిజంగా ఎవర్‌గ్రీన్ అన్నారు. సభ బయట కూడా ఆయన వ్యంగాన్ని, హాస్యాన్ని ప్రదర్శించాలని ఆశించారు. పార్లమెంట్ పక్రియలో ఉన్న ఉభయసభల విధానం గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. ఓ చట్టానికి ఆమోదం దక్కాలంటే రెండో అభిప్రాయం అవసరంమని, అలాంటి విధానం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఒక సభలో తీసుకున్న నిర్ణయం.. రెండో ఓపీనియన్ కోసం మరో సభకు వెళ్తుందని, అక్కడ జరిగిన చర్చతో నిర్ణయాత్మక విధానం కొత్త రూపు సంతరించుకుంటుదని ప్రధాని అన్నారు. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యుల వీడ్కోలు సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం నాడు కాసేపు నవ్వులు పూయించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని, ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ’అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ, ఆయన మాతో ప్రేమ సాగించి మోదీని పెళ్లి చేసుకున్నారు’ అంటూ చమత్కరించారు. దీంతో సభలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా నవ్వులు చిందించారు. దేశానికి సేవ చేయాలనే తపన కలిగిన వారు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎన్నడూ అలసిపోరని ఖర్గే అన్నారు. దేవెగౌడ 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమారు ఒక ఏడాది పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్‌డీ దేవెగౌడ ’జేడీఎస్’తో కాంగ్రెస్ పొత్తు సాగించింది. ఆ కూటమి విజయం సాధించింది. దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019లో పలువురు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంది. కాగా, రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సెషన్‌లో శరద్ పవార్, డీఎంకే నేత తిరుచ్చి శివతో తన అనుబంధాన్ని కూడా ఖర్గే గుర్తుచేసు కున్నారు. అయితే పవార్, తిరుచ్చి శివ తిరిగి రాజ్యసభకు రాబోతున్నారు. ఖర్గే తన ప్రసంగంలో కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ(ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలేపై కూడా ఛలోక్తులు విసిరారు. ’ఆయన ఎప్పుడూ తన కవితల్లో మోదీని పొగుడుతుంటారు. ఆయనకు మరే ఇతర కవితలు తెలియవేమో’ అంటూ చమత్కరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



