కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: కూకట్‌పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కారణంగా ముగ్గురు మృతిచెందిన సంఘటనపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. ఈ సంఘటనలో 19మంది తీవ్ర అస్వస్థతకు గురవగా చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు మృతిచెందారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంఘటనకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. మూడు రోజుల(ఆదివారం) నాడు హైదర్‌నగర్, షంషీగూడ, ఎల్లమ్మబండలోని కల్లు కాంపౌండ్‌లలో వీరు కల్లు సేవించారు. బాధితులందరూ ఒకే తరహా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిని తొలుత కూకట్‌పల్లిలోని రాందేవ్‌రావు హాస్పిటల్‌లో చేర్చారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. నిమ్స్‌లో 15 మంది చికిత్స పొందుతుండగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో వ్యక్తి ఇంట్లోనే మృతి చెందాడు. కాగా, చికిత్స పొందుతున్న కల్లు బాధితులని మంత్రి జూపల్లి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను నిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 15 మంది పరిస్ఠితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్‌లను సీజ్ చేశామని, వాటి నిర్వాహకులను అరెస్టు చేశామని వెల్లడిరచారు. కల్లు శాంపిల్‌ను పరీక్ష కోసం ల్యాబ్‌కి పంపామని, ఎక్సైజ్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. కాగా, మృతులను తులసీరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్ సాయిచరణ ్‌కాలనీకి చెందినవారుగా అధికారులు తెలిపారు.





